చావడానికైనా.. చంపడానికైనా సిద్ధం.. టీడీపీపై దొన్ను దొర తిరుగుబాటు
తెలుగుదేశం తన తొలి జాబితాలోనే అరకు అసెంబ్లీ అభ్యర్థిగా దొన్ను దొరను ప్రకటించింది. తర్వాత బీజేపీతో పొత్తు కుదరడంతో అరకు అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించింది.
ఏపీలో కూటమి పార్టీల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా అరకు టీడీపీ ఇన్‌ఛార్జి దొన్ను దొర తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. టికెట్ ఇచ్చినట్లు ఇచ్చి.. వెనక్కి తీసుకోవడంతో పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు దొన్ను దొర. అరకు అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.
పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు దొన్ను దొర. తనను మోసం చేసిన వారిని చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు తనను హైదరాబాద్ పిలిచి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని.. కానీ కార్యకర్తలు చంద్రబాబును నమ్మొద్దని తీర్మానించారన్నారు దొన్ను దొర.
తెలుగుదేశం తన తొలి జాబితాలోనే అరకు అసెంబ్లీ అభ్యర్థిగా దొన్ను దొరను ప్రకటించింది. తర్వాత బీజేపీతో పొత్తు కుదరడంతో అరకు అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించింది. దీంతో పాంగి రాజారావును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే మొదట తనను అభ్యర్థిగా ప్రకటించి.. తర్వాత తప్పించడాన్ని దొన్ను దొర జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
2014, 19 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా అరకు స్థానాన్ని గెలుచుకుంది వైసీపీ. 2019 ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ తరపున పోటీ చేసిన దొన్ను దొర దాదాపు 27 వేలకు పైగా ఓట్లు సాధించాడు. ఈ సారి కూడా దొన్ను దొర ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటే ఓట్లు భారీగా చీలి కూటమికి నష్టం జరిగే అవకాశాలున్నాయి.
ఏపీలో మరో వారం రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. కూటమిలో మాత్రం అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. అరకుతో పాటు పాడేరు, ఉండి, అనపర్తి, రాజంపేట, మాడుగుల, పెడన నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతులు పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు.