ఏపీ అప్పులు పెరిగాయి కానీ, ద్రవ్యలోటు తగ్గింది..
ఏపీ అప్పులు ఎక్కువగా ఉన్నా, ద్రవ్యలోటు తక్కువగా ఉందని వివరణ ఇచ్చారు.
ఏపీ అప్పులు పెరిగాయి, ఏపీ మరో శ్రీలంకగా మారబోతోంది, అప్పులు తెచ్చి మరీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలా..? అసలు ఏపీని ఏం చేయాలనుకుంటున్నారు..? ఇవీ ప్రస్తుతం ప్రతిపక్షాల విమర్శలు. ఈ విమర్శలకు అనుగుణంగానే ప్రతిపక్ష పార్టీల అనుకూల మీడియా నుంచి వచ్చే కథనాలతో ప్రజల్లో మరింత గందరగోళం ఏర్పడింది. దీంతో వైసీపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది, ఎదురు దాడికి దిగింది. కానీ రాజకీయ నాయకులు చేస్తున్న ప్రతి విమర్శలను ప్రజలు కేవలం పొలిటికల్ స్టంట్ గా మాత్రమే చూస్తున్నారనే భావన కూడా ఉంది. దీంతో పూర్తి గణాంకాలతో ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మీడియా ముందుకొచ్చారు. ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులకు మించి అప్పులు చేసింది గత ప్రభుత్వమేనని, జగన్ ప్రభుత్వ హయాంలో అప్పులెక్కడా హద్దులు దాటలేదన్నారాయన.
రాష్ట్ర విభజన నాటికి ఏపీ అప్పులు 1.34 లక్షల కోట్లు అని వివరించారు దువ్వూరి కృష్ణ. చంద్రబాబు హయాంలో అప్పుల శాతం 19.4 గా ఉండగా, ఇప్పుడు 15.77 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని వివరించారు. టీడీపీ అధికారంలోనుంచి దిగిపోయే నాటికి ఏపీ అప్పులు 2.68 లక్షల కోట్లు ఉండగా.. ప్రస్తుతం ఏపీ అప్పులు 3.80 లక్షల కోట్లు అని లెక్క చెప్పారు. ఏపీ అప్పులు ఎక్కువగా ఉన్నా, ద్రవ్యలోటు తక్కువగా ఉందని వివరణ ఇచ్చారు.
శ్రీలంక ఆర్థిక పరిస్థితికి, ఏపీ ఆర్థిక పరిస్థితికి ఎక్కడా పొంతన లేదని, అసలా పోలిక కూడా సరికాదని అన్నారు దువ్వూరి కృష్ణ. శ్రీలంకలో వ్యవసాయ ఉత్పత్తి పడిపోయి దిగుమతులుపై ఆధారపడతం వల్లే అక్కడ జీడీపీ పడిపోయిందని, ఆదేశ ఆర్థిక పరిస్థితి కుదేలయిందని చెప్పారు. అలాంటి పరిస్థితులు చూసిన తర్వాత ఇతర దేశాలు కానీ, ఆయా దేశాల్లోని రాష్ట్రాలు కానీ అప్పుల భారం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతానికి ఏపీ పరిస్థితి అది కాదని వివరణ ఇచ్చారు. కోవిడ్, ఇతర కారణాల వల్ల కేంద్రం కూడా అప్పు చేసిందని గుర్తు చేశారు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం నిబంధనలు పక్కనపెట్టి అప్పులు చేసిందని, వైసీపీ హయాంలో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందన్నారు.