ఏపీలో విద్యా సంస్కరణలకు అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు
ఐటీ సృష్టికర్తను, సాప్ట్ వేర్ దిగ్గజాన్ని అని చెప్పుకునే చంద్రబాబు ఏపీలో విద్యాసంస్కరణల దిశగా ఏమాత్రం చొరవ తీసుకోలేకపోయారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో విద్యావ్యవస్థ రూపు రేఖలు మారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నేషనల్ బకలారియేట్ (ఐబీ) సిలబస్ అమలు చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉపాధ్యాయుల్ని సన్నద్ధం చేసే ప్రక్రియ జరుగుతోంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఏడాది దాన్ని రెండో తరగతికి విస్తరిస్తారు. అలా 2035 నాటికి పదో తరగతికి, 2037 నాటికి పన్నెండో తరగతికి ఐబీ సిలబస్ లో బోధన మొదలవుతుంది. ఈ ప్రయత్నానికి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు లభించాయి. తాజాగా ప్యారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సులో కూడా ఏపీలో ఐబీ ప్రస్తావన వచ్చింది. ఆ్రస్టేలియన్ ఎడ్యుకేషనల్ అవార్డు గ్రహీత డోనా రైట్ ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలను ప్రశంసించారు. ప్రాథమిక విద్యపై ఎన్నో పరిశోధనలు చేసిన రైట్... ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలునిర్ణయం గొప్పదని అభినందించారు. ఏపీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని స్విట్జర్లాండ్‌లోని ఐబీ సంస్థ ఈక్విటీ అండ్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగం సీనియర్ మేనేజర్ డాక్టర్ కళా పరశురామ్ తెలిపారు.
‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సులో ఐక్యరాజ్య సమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ పాల్గొన్నారు. ఏపీలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి దాదాపు 38 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలు చేయబోతున్నట్టు సదస్సులో ప్రస్తావించారు షకిన్ కుమార్. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో మారిన పరిస్థితులపై అక్కడ ఓ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఏపీలో విద్యా సంస్కరణలను ప్రశంసించడమే కాకుండా, తమ వంతు సహకారం అందిస్తామని పలువురు ముందుకు రావడం విశేషం. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కెపాసిటీ బిల్డింగ్, అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సహకరిస్తామని యునెస్కో ఇన్‌క్లూజన్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ హెడ్ తమరా మార్టి కసాడో హామీ ఇచ్చారు.
ఐటీ సృష్టికర్తను, సాప్ట్ వేర్ దిగ్గజాన్ని అని చెప్పుకునే చంద్రబాబు ఏపీలో విద్యాసంస్కరణల దిశగా ఏమాత్రం చొరవ తీసుకోలేకపోయారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో విద్యావ్యవస్థ రూపు రేఖలు మారిపోయాయి. నాడు-నేడులో భాగంగా ముందుగా స్కూల్స్ ని ఆధునీకరించారు. ఆ తర్వాత సిలబస్ పై దృష్టిపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం బోధనతో విద్యార్థుల స్కిల్స్ మెరుగుపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఐబీ సిలబస్ ను కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పేద విద్యార్థుల ముందుకు తెస్తున్నారు సీఎం జగన్. ఐబీ సిలబస్ లో చదివిన వారికి ఐబీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు.