రామోజీ సేవలను కొనియాడిన షర్మిల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ వర్సెస్‌ రామోజీరావు అన్నట్లుగా నడిచింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయనకు వ్యతిరేకంగా ఈనాడు ప్రత్యేక కథనాలను వండివార్చింది.

Advertisement
Update:2024-06-19 16:51 IST

ఈనాడు గ్రూప్స్‌ అధినేత చెరుకూరి రామోజీరావుకు నివాళులర్పించారు ఏపీసీసీ చీఫ్‌ వై.ఎస్‌. షర్మిల. ఫిల్మ్‌ సిటీకి స్వయంగా వెళ్లి రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రామోజీ రావు సతీమణి రమాదేవితో పాటు ఆయన కోడళ్లు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరిలను పరామర్శించారు. తర్వాత రామోజీ కుటుంబసభ్యులందరితో కలిసి ప్రత్యేకంగా ఓ ఫోటో దిగారు షర్మిల. మీడియా రంగంలో రామోజీ సేవలను గుర్తు చేసుకున్నారు.



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ వర్సెస్‌ రామోజీరావు అన్నట్లుగా నడిచింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయనకు వ్యతిరేకంగా ఈనాడు ప్రత్యేక కథనాలను వండివార్చింది. వైఎస్సార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం పథకాన్ని ధనయజ్ఞం అని, లక్ష కోట్ల అవినీతి అంటూ ఆ రోజుల్లో పెద్దపెద్ద బ్యానర్లతో వార్తలను ఏళ్లకు ఏళ్లు ప్రచారం చేసింది. వైఎస్సార్‌ మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్‌తోనూ శత్రుత్వాన్ని కంటిన్యూ చేశారు రామోజీరావు. గడిచిన ఐదేళ్లు జగన్‌కు, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా విచ్చలవిడిగా వార్తలు రాయించారు. ఆ విధంగా వైఎస్సార్ కుటుంబానికి రామోజీరావు శాశ్వత శత్రువుగా మిగిలిపోయారు.


చంద్రబాబుకు రాజకీయ గురువుగా రామోజీరావుకు పేరుంది. సొంత సామాజికవర్గం కావడంతో చంద్రబాబును వెనకేసుకు వచ్చేది రామోజీ పరివారం. ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతిది కూడా ఇదే దారి. ఈ రెండు పత్రికలు గతంలో వైఎస్సార్‌ను, ఇప్పుడు జగన్‌ను టార్గెట్‌ చేశాయి.. చేస్తూనే ఉన్నాయి. ఐనప్పటికీ రామోజీరావు మరణం తర్వాత జగన్‌ సోషల్‌ మీడియా వేదికగా తన సంతాపాన్ని ప్రకటించారు. వైసీపీ ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఫిల్మ్‌ సిటీకి వెళ్లి నివాళులర్పించారు. ఐతే మరణించేవరకు తన కుటుంబానికి వ్యతిరేకంగా వార్తలు రాయించిన రామోజీరావుకు షర్మిల ప్రత్యేకంగా నివాళులర్పించడం ప్రత్యేకత సంతరించుకుంది.

Tags:    
Advertisement

Similar News