వాట్సప్ లో ప్రచారం.. ఏపీ పోలీస్ ల హడావిడి

వాస్తవానికి వాలంటీర్లెవరూ ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలనుకోవట్లేదు. రాజీనామా చేయనివాళ్లకి పాత జీతాలు పడుతూనే ఉన్నాయి. వైసీపీకోసం రాజీనామా చేసినవాళ్లు మాత్రం తమ సంగతేంటని అర్జీలు పట్టుకుని తిరుగుతున్నారు.

Advertisement
Update: 2024-07-03 06:09 GMT

"ఏపీ వాలంటీర్లు రోడ్డెక్కడానికి సిద్ధమయ్యారు. తమ ఉద్యోగాలు ఉంటాయో లేవో తెలియని పరిస్థితుల్లో వారు చలో విజయవాడకు పిలుపునిచ్చారు, కలెక్టరేట్ ని చుట్టుముట్టబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు విజయవాడకు బయలుదేరారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తమ భవిష్యత్ ఏంటని నిలదీయబోతున్నారు." ఈ ప్రచారం ఎక్కడ ఎలా మొదలైందో తెలియదు కానీ పోలీసులు మాత్రం హడావిడి పడిపోయారు. వాలంటీర్లు నిజంగానే విజయవాడకు వస్తున్నారేమోనని అన్ని చోట్లా చెకింగ్ లు మొదలు పెట్టారు. తీరా అక్కడ అలాంటిదేమీ లేదని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ఎందుకీ ప్రచారం..?

తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల పారితోషికాన్ని రూ.5వేలనుంచి రూ.10వేలకు పెంచుతామని కూటమి హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అలాంటి పెంపు ప్రతిపాదనలేవీ లేవు. పైగా ఇటీవల పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టారు అధికారులు. కేవలం సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేపట్టారు. దీంతో వాలంటీర్లలో ఆందోళన పెరిగిపోయింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వారు చలో విజయవాడ అనే కార్యక్రమం చేపట్టారనే ప్రచారం జరిగింది. వాట్సప్ లో ఈ మెసేజ్ లు విపరీతంగా సర్కులేట్ అయ్యాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా కాకముందే ఇలాంటి ఆందోళనలు, నిరసనలు మొదలైతే చెడ్డపేరు వస్తుందని అనుకున్నారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టారు, చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండుల్లో తనిఖీలు చేపట్టారు. తీరా అసలు వాలంటీర్ల చలో విజయవాడ అనేది కేవలం వాట్సప్ ప్రచారం అని తేలిపోయింది. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

వాస్తవానికి వాలంటీర్లెవరూ ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలనుకోవట్లేదు. రాజీనామా చేయనివాళ్లకి పాత జీతాలు పడుతూనే ఉన్నాయి. వైసీపీకోసం రాజీనామా చేసినవాళ్లు మాత్రం తమ సంగతేంటని అర్జీలు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది తేలాల్సి ఉంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు అవసరం లేదని ఈ నెలతో తేలిపోయింది. మరి వారికి జీతం పెంచి కొత్తగా మరిన్ని విధులు అప్పగిస్తారా..? అసలు ఎంతమందిని రిక్రూట్ చేసుకుంటారు, రాజీనామా చేసిన వారి సంగతేంటి అనేదానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. 

Tags:    
Advertisement

Similar News