జగన్ కి మూడు ప్రశ్నలు సంధించిన పవన్
వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వుమన్ ట్రాఫికింగ్ వ్యాఖ్యలు పక్కకు పోయి, ఇప్పుడు వాలంటీర్లు సేకరిస్తున్నడేటా ఎక్కడకు పోతోంది, వాలంటీర్ల విధులేంటి అనేది హైలెట్ అవుతోంది.
ఏపీలో వాలంటీర్ల వ్యవహారం వచ్చే ఎన్నికల వరకు బర్నింగ్ టాపిక్ లాగా ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు కూడా ఎక్కడా తగ్గడంలేదు. పవన్ పై కేసు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడింది, ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేందుకు పవన్ సై అంటున్నారు. అసలు వాలంటీర్లు ఎవరు, వారి విధులు ఏంటి..? అనేది ప్రభుత్వం నోటివెంటే చెప్పించాలనుకుంటున్నారు.
మూడు ప్రశ్నలు సంధించిన పవన్..
1. వాలంటీర్ల బాస్ ఎవరు?
2. ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?
3. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు?
అంటూ పవన్ కల్యాణ్ తాజాగా ట్విట్టర్లో మూడు ప్రశ్నలు సంధించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల వ్యక్తిగత డేటా భద్రత గురించి జగన్ వ్యాఖ్యల వీడియోని తన ట్వీట్ లో పొందుపరిచారు పవన్. మైడియర్ 'వాట్సన్' అంటూ పవన్ సంబోధించడం కూడా కలకలం రేపుతోంది.
వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా కాదా అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులైతే వారికి జీత భత్యాలివ్వాలి, ఒకవేళ కాదు అంటే వ్యక్తిగత సమాచారం సేకరించే పనుల్ని, ఇతర ఎన్నికల వ్యవహారాలను వారికి అసైన్ చేయకూడదు. దీనిపై ఇప్పుడు జనసేన సూటిగా ప్రశ్నిస్తోంది. ఏపీలో వాలంటీర్ల విషయంలో ఏదో ఒకటి తేలిపోవాలని అంటోంది. ఒకరకంగా వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వుమన్ ట్రాఫికింగ్ వ్యాఖ్యలు పక్కకు పోయి, ఇప్పుడు వాలంటీర్లు సేకరిస్తున్నడేటా ఎక్కడకు పోతోంది, వాలంటీర్ల విధులేంటి అనేది హైలెట్ అవుతోంది.