మాధవ్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్.. ఫోరెన్సిక్ నివేదిక విడుదల...!!

ఆ వీడియోనే ఒరిజినల్ అని, ఆ విషయం తాము ఆరోపిస్తుంది కాదని, అమెరికాలోని ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిందని అంటున్నారు పట్టాభి. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెప్పించిన నివేదిక అంటూ పట్టాభి కొన్ని పేపర్లు విడుదల చేశారు.

Advertisement
Update:2022-08-13 17:57 IST

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ నేతలు ఆయన్ను వెనకేసుకు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో అనంతపురం ఎస్పీ కూడా ఆ వీడియోలో పసలేదని తేల్చేశారు, అది ఒరిజినల్ కాదన్నారు. అయితే టీడీపీ మాత్రం ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేలా లేదు, లోక్ సభ స్పీకర్ కు, జాతీయ మహిళా కమిషన్ కు, ఏపీ గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేసి తగ్గేది లేదంటున్నారు టీడీపీ నేతలు. తాజాగా ఆ వీడియో ఫోరెన్సిక్ నివేదిక ఇదీ అంటూ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కలకలం రేపారు. ఈ నివేదిక ఆధారంగా ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎక్కడిదీ నివేదిక..?

ఒరిజినల్ వీడియో లేనిదే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపలేమని చెప్పారు అనంతపురం పోలీసులు. అయితే ఆ వీడియోనే ఒరిజినల్ అని, ఆ విషయం తాము ఆరోపిస్తుంది కాదని, అమెరికాలోని ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిందని అంటున్నారు పట్టాభి. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెప్పించిన నివేదిక అంటూ పట్టాభి కొన్ని పేపర్లు విడుదల చేశారు. ఈనెల 9న ఆ వీడియోని అమెరికాలోని సదరు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించామని ఇప్పుడు నివేదిక వచ్చిందని అంటున్నారు పట్టాభి. జిమ్ స్టాఫర్డ్ అనే టెక్నికల్ ఎక్స్ పర్ట్ ఈ విషయం తేల్చారని అంటున్నారు. అది కమ్మవాళ్లు ఇచ్చింది కాదని సెటైర్లు వేశారు.

పోర్న్ స్టార్ కి కటౌట్లా..?

ఎంపీ మాధవ్‌ని పోర్న్ స్టార్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత. తాము విడుదల చేసిన ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఎంపీపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా మంత్రులు కూడా ఈ విషయంలో మార్ఫింగ్ అంటూ అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు అనిత. పోరంబోకు ఎంపీకి అనంతపురంలో స్వాగతం చెబుతూ హోర్డింగ్స్ పెడతారా అంటూ ప్రశ్నించారు. ఈ ఫోరెన్సిక్ నివేదికను రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్తామని వెల్లడించారు అనిత. ఇప్పుడీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై వైసీపీ రియాక్షన్ ఏంటి..? ఈ ఫోరెన్సిక్ నివేదికను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకుంటారా..? ఆ దిశగా విచారణ జరుపుతారా..? అనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News