అలజడికి నీవే బాధ్యత వహిస్తావ్ చంద్రబాబు
ఉత్తరాంధ్ర మీదుగా అమరావతివాదులు చేస్తున్నది పాతయాత్రనా లేక దండయాత్రనా అని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ముమ్మాటికీ అమరావతివాదులది అసమర్థుల అంతిమ యాత్ర అని విమర్శించారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు వచ్చిన గుండెనొప్పి ఏంటని ప్రశ్నించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఉత్తరాంధ్ర మీదుగా అమరావతివాదులు చేస్తున్నది పాతయాత్రనా లేక దండయాత్రనా అని ప్రశ్నించారు. ముమ్మాటికీ అమరావతివాదులది అసమర్థుల అంతిమ యాత్ర అని స్పీకర్ విమర్శించారు. అందరి శక్తిని హైదరాబాద్‌లోనే కేంద్రీకరించడం వల్ల ఇతర ప్రాంతాలు మొత్తం నిర్లక్ష్యానికి గురయ్యాయని వ్యాఖ్యానించారు. మొత్తం ఒకేచోట కేంద్రీకృతం అయితే మరోసారి విభజనవాదాలు వస్తాయన్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి పరిస్థితి రాకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని ఇందులో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.
ఒకే సామాజిక వర్గానికి అమరావతిలో భూములు కట్టబెట్టారని, అదే చంద్రబాబు ఇబ్బంది అన్నారు. రాజధాని వస్తుందని ముందే చెప్పి, తన వారంతా రండి.. సొంత జాగీరుగా మార్చుకుందాం, రాష్ట్రంపై అజమాయిషి చేద్దామన్న దురాలోచనతోనే అమరావతిని రాజధాని చేశారన్నారు. అమరావతివాదులు చేస్తున్న పాదయాత్ర అమరావతి రాజధానిగా ఉండాలని కాదని.. ఉత్తరాంధ్రలో రాజధాని వద్దు అని చేస్తున్నారన్నారు.
అలాంటి యాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. స్పీకర్‌గా ఉన్నప్పటికీ తాను ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతానన్నారు. ఈ ప్రాంతంలో పేదరికం, నిరుద్యోగం ఉందని.. ఇంకా ఎంత కాలం తమ ప్రాంత ఉసురును చంద్రబాబు పోసుకుంటారని నిలదీశారు. అమరావతిలో పేదలు, దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని అడ్డుపడడం ఏంటన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక అసమానతలు వస్తాయంటున్నారని.. దాని అర్థం ఏంటో రామోజీరావు చెప్పాలన్నారు. ఇంకా ఎంత కాలం ఈ అన్యాయాన్ని కొనసాగిస్తారని నిలదీశారు. ఈ దోపిడి ఆలోచన, దొరతనాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఇంకా ఎంతకాలం భరించాలని మండిపడ్డారు.
చంద్రబాబు చేయిస్తున్నది ఉన్మాదపు యాత్ర అని ఫైర్ అయ్యారు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఈ పాదయాత్రకు అంగీకరిస్తారా ?.. సిగ్గు, లజ్జ, ఇంగితం అన్నీ వదిలేసినవాడే ఈ పాదయాత్రకు అంగీకరిస్తారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ పాదయాత్రను అడ్డుకుని తీరుతారన్నారు. ఉత్తరాంధ్రలో అశాంతి చెలరేగితే అందుకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.