ఈసీ వర్సెస్ వైసీపీ.. ఏపీలో ఏం జరుగుతోంది..?
కౌంటింగ్ రోజు కూడా వ్యవస్థలన్నీ ఈసీ కంట్రోల్ లోనే ఉంటాయి. ఈ దశలో వైసీపీ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఏపీ రాజకీయాలు ఎన్నికల కమిషన్ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయాయి. ఈసీ కూటమి చేతిలో పావుగా మారిందని వైసీపీ బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. మరోవైపు ఈసీ కూడా టీడీపీ ఫిర్యాదులన్నిటిపై వెంటనే స్పందిస్తూ, వైసీపీ ఆరోపణలను పెడ చెవిన పెట్టడంతో ఈ విమర్శలకు బలం చేకూరింది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ అంశంలో ఈసీ, వైసీపీ తాడోపేడో తేల్చుకోబోతున్నాయి. వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.
పోలింగ్ కి ముందు ఏపీలో కీలక అధికారుల్ని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. కూటమి ఫిర్యాదులే ఈ బదిలీకి కారణం. అలా బదిలీలు జరిగిన చోటల్లా ఎన్నికల రోజు హింస జరిగింది. వైసీపీకి నష్టం చేసేలా టీడీపీ రెచ్చిపోయింది. పల్నాడులో జరిగిన హింసకు, రిగ్గింగ్ కి ఈసీ పరోక్ష సహకారం ఉందని, పోలీసులు కూడా టీడీపీతో కలసిపోయారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంని ధ్వసం చేసిన వీడియో.. ఈసీ, వైసీపీ మధ్య మరింత దూరం పెంచింది. ఆ వీడియోని ఉద్దేశపూర్వకంగానే టీడీపీ చేతికి ఇచ్చి లీక్ చేయించారనేది వైసీపీ ఆరోపణ. పైగా ఆ వీడియో బయటకొచ్చాక పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఈసీ, పోలీస్ వ్యవస్థ తీవ్రంగా ప్రయత్నించాయి. చివరకు కోర్టు జోక్యంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంతో ఏపీ ఎన్నికల అధికారులు పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.
కౌంటింగ్ రోజు ఏం జరుగుతుంది..?
కౌంటింగ్ రోజు కూడా వ్యవస్థలన్నీ ఈసీ కంట్రోల్ లోనే ఉంటాయి. ఈ దశలో వైసీపీ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. టీడీపీ ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించే అవకాశముందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఈసీ సహకరిస్తే, ఫలితాలను తారుమారు చేసేందుకు చూడా వారు వెనకాడరని, పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఏపీలో పోటీ కూటమి, వైసీపీ మధ్య కాకుండా.. ఇప్పుడు వైసీపీ వర్సెస్ ఈసీ అన్నట్టుగా మారిపోయింది.