తన మద్దతు ఎవరికో క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
తాను నేరుగా రంగంలోకి దిగకపోయినా.. బరిలో ఉన్న వారికి మాత్రం తన ఆశీస్సులుంటాయని తాజాగా మరో క్లారిటీ ఇచ్చారు చిరంజీవి.
చిరంజీవి తనకు తాను ఏ పార్టీకి మద్దతిస్తున్నానని చెప్పలేదు. తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేనకోసం ఆయన విరాళం ఇవ్వడం, తమ్ముడి గురించి పొగుడ్తూ ట్వీట్ వేయడంతో సహజంగానే ఆయన మద్దతు జనసేనకు ఉంటుందని అనునుకుంటున్నారంతా. అదే సమయంలో ఆయన ఇంకా కాంగ్రెస్ నాయకుడేనంటూ కొంతమంది హస్తం పార్టీ పెద్దలు చెప్పుకోవడం విశేషం. అసలింతకీ చిరంజీవి ఎవరివైపు.. ? ఆయన ఏ పార్టీకి మద్దతిస్తున్నారనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గా మారింది.
ఇటీవల తన జీవితం ఇక సినిమాలకే అంకితం అంటూ చిరంజీవి స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఆయన రాజకీయ రంగ పునఃప్రవేశంపై ఓ క్లారిటీ వచ్చింది. అయితే తాను నేరుగా రంగంలోకి దిగకపోయినా.. బరిలో ఉన్న వారికి మాత్రం తన ఆశీస్సులుంటాయని తాజాగా మరో క్లారిటీ ఇచ్చారు. అనకాపల్లినుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ తాజాగా చిరంజీవిని కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనకు తన మద్దతు ఉంటుందని, ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు చిరంజీవి. ఏపీ ప్రజలకు సీఎం రమేష్ వల్ల మంచి జరగాలన్నారు.
అంటే చిరంజీవి ఇక్కడ పార్టీలపరంగా ఎవరికీ ప్రత్యేకంగా మద్దతివ్వడంలేదనమాట. తనకు కావాల్సిన వారు వచ్చి మద్దతు అడిగితే కచ్చితంగా వారికి ఆశీర్వాదం ఇస్తారని తేలిపోయింది. అయితే జనసేనతో కూటమి కట్టిన అభ్యర్థులకు మాత్రమే ఆ ఆశీస్సులుంటాయా, లేక ఇతర పార్టీల వారికి కూడానా అనేది తేలాల్సి ఉంది. వైసీపీలో కూడా చిరంజీవికి తెలిసినవారు, కావాల్సినవారు చాలామందే ఉన్నారు. వారంతా ఆయన్ను కలిస్తే పవన్ కల్యాణ్ కి ఇబ్బందే మరి.