ముద్రగడ అటా..? ఇటా..? పెరుగుతున్న పొలిటికల్ హీట్
నిన్న జనసేన నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ రోజు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఆయన ఇంటికి వెళ్లారు.
ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎన్నికల సీజన్ లో కండువాలు మార్చే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అయితే అటా, ఇటా అనేది ఇంతవరకు తేల్చకుండా మేనేజ్ చేసిన కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి తెరపైకి వచ్చారు. ఆయన వైసీపీలోకి వస్తున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆయన టీడీపీ-జనసేన కూటమివైపు అడుగులేస్తున్నట్టు అనిపిస్తోంది.
చర్చోప చర్చలు..
నిన్న జనసేన నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ రోజు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నెహ్రూ, ముద్రగడకు చెప్పినట్టు సమాచారం. కాపు నేతగానే తాను ముద్రగడ దగ్గరకు వచ్చానని, టీడీపీ నేతగా కాదని నెహ్రూ క్లారిటీ ఇచ్చారు. ముందు తన నియోజకవర్గంలో కాపులను కలపాలి కాబట్టి తాను ముద్రగడ ఇంటికి వచ్చానన్నారాయన. టీడీపీ-జనసేన కూటమిలో కాపులకి అధిక ప్రాధాన్యత ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారట. జాతికి ప్రయోజనాలు ఉన్నాయంటే కలిసి ప్రయాణం చేద్దామని ముద్రగడ ఆయనతో చెప్పారని సమాచారం.
కాపు ఓటరు ఏవైపు..?
ముద్రగడ ఏవైపు ఉంటే కాపు ఓట్లు ఆవైపు పడతాయనుకోలేం. పవన్ కల్యాణ్ ఎవరితో జట్టు కడితే కాపులంతా ఆవైపే ఉంటారనుకోలేం. కానీ 2024 ఎన్నికల్లో కాపు ఓట్ల పోలరైజేషన్ బాగా జరుగుతుందనే అంచనా ఉంది. అయితే అది జగన్ కి అనుకూలంగానా లేక వ్యతిరేకంగానా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ టీడీపీతో ఉన్నారు. అంబటి రాయుడు వంటి వారు కూడా ఈ కూటమివైపే చూస్తున్నారు. ముద్రగడ కూడా ఈవైపు వచ్చేస్తే టీడీపీకి అది మరింత లాభం చేకూర్చే అంశం అని అంటున్నారు. ఎన్నికలనాటికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.