పుట్టు పూర్వోత్తరాలు.. ఏపీలో తిట్ల రాజకీయాలు
చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కౌంటర్లు పడ్డాయే కానీ వైసీపీ నాయకులెవరూ వెంటనే స్పందించలేదు. కాస్త ఆలస్యంగా అయినా మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా బదులిచ్చారు.
ఏపీ రాజకీయాల్లో తిట్లు, బూతులు వినపడటం సహజంగా మారిపోయింది. ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థి వర్గంపై ఒక్క బూతు కూడా లేకుండా ప్రసంగం ముగిస్తే.. వారికి నాయకత్వ లక్షణాలు లేవని అనుకునే పరిస్థితి. మర్యాదకు మారుపేరు, క్రమశిక్షణకు అసలు పేరు మా పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇటీవల చాలా సందర్భాల్లో బోర్డర్ క్రాస్ చేశారు. తాజాగా ఆయన సీఎం జగన్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. చివరకు ఆయన్నే బజారుకీడ్చాయి.
చంద్రబాబు ఏమన్నారు..?
సీఎం జగన్ ని విమర్శించే క్రమంలో చంద్రబాబు ఇటీవల శృతి మించారు. జగన్ పుట్టుక తప్పుడు పుట్టుక అన్నారు. "సైకో జగన్, నువ్వెక్కడున్నావో నాకు తెలియదు, నువ్వు లండన్ లో ఉన్నా ఇక్కడ విధ్వంసం మానలేదు. నీది తప్పుడు పుట్టుక, నీది వక్రబుద్ధి, ప్రజల్ని నానా హింసలు పెట్టావు. ఈరోజు రాయదుర్గం నుంచి చెబుతున్నా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్తాపితం చేస్తా." అంటూ ఊగిపోయారు.
పేర్ని నాని ఘాటు రియాక్షన్..
చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కౌంటర్లు పడ్డాయే కానీ వైసీపీ నాయకులెవరూ వెంటనే స్పందించలేదు. కాస్త ఆలస్యంగా అయినా మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా బదులిచ్చారు. "తనకు తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యుడు చంద్రబాబు. జగన్ గర్వంగా నా తండ్రి వైఎస్సార్ అని నిత్యం చెప్పుకుంటూనే ఉన్నారు. బాబు తన 40 ఏళ్ళ రాజకీయ జీవితం లో ఏనాడూ తండ్రి పేరు చెప్పలేదు. ఎవరిది దౌర్భాగ్యమైన పుట్టుక? ఎవరిది దౌర్భాగ్యమైన బ్రతుకు..?" అంటూ ఫైరయ్యారు పేర్ని నాని. తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా చంద్రబాబు కనీసం తలకొరివి పెట్టలేదని, జుట్టు కూడా తీయలేదని, సంప్రదాయాలు పాటించలేదని ఎద్దేవా చేశారు.