ఎందుకీ విధ్వంసం..? ఏమిటీ వైషమ్యం..?
తప్పు ఎవరు చేసినా అది తప్పే. మేం చిన్న తప్పు చేశాం, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు అని ఎంచుకోవడంలో అర్థం లేదు. అధికారంలో ఉన్నవారు ఏం చేసినా పోలీసులు చేతులు కట్టుకోవడం ఇప్పుడే మొదలు కాలేదు.
2014 ఎన్నికల తర్వాత ఏపీలో పెద్దగా గొడవలు జరగలేదు.
2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల ఘన విజయం సాధించినా కూడా పెద్దగా అలజడి లేదు.
2024 ఎన్నికల తర్వాత మాత్రం ఎక్కడలేని విధ్వంసం మొదలైంది. వైఎస్ఆర్ అనే పేరు కనపడగానే టీడీపీ నేతలకు పూనకం వచ్చేసింది. వైఎస్ఆర్ విగ్రహాల పట్ల కూడా అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ఆర్ పేరున్న సంస్థలపై దాడులు చేసి ఆ అక్షరాలను తొలగిస్తున్నారు. ఆఖరికి యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్లను కూడా వదల్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రత్యర్థి వర్గానికి చెందిన నేతల ఇళ్లపై రాళ్లదాడులు, కోడిగుడ్ల దాడులు సరేసరి. కింది స్థాయి కార్యకర్తలపై కర్రలు విరుగుతున్నాయి, రక్తగాయాలవుతున్నాయి.
తప్పు మీది.. కాదు మీదే
దాడుల్ని ఎవరు ప్రోత్సహించినా అది తప్పే. కానీ ఇక్కడ తప్పు మీదంటే మీదని నిందలు వేసుకుంటున్నారు నేతలు. దాడులు సరికాదని వైసీపీ నేతలు చెబుతుంటే.. టీడీపీ వాళ్లు గత చరిత్ర తవ్వి తీస్తున్నారు. గతంలో మీరు చేసిన దాడుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో వైసీపీ నేతలు దాడులు చేస్తే అది కోపంతో, బీపీ వచ్చి చేసిన పనులని కవర్ చేసుకున్నారు కదా, ఇప్పుడు నొప్పి తెలిసిందా అని వెటకారం చేస్తున్నారు.
వైసీపీనేతలు ఏం చేశారు..?
గతంలో ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలెవరూ ఈ స్థాయిలో దాడులకు తెగబడలేదు. ఆ తర్వాతే పరిస్థితి కాస్త శృతి మించింది. వైసీపీ నేతల ఘాటు వ్యాఖ్యల్ని ఎల్లో మీడియా హైలైట్ చేసింది. బూతుల మంత్రులంటూ కొందరిపై ముద్రవేసింది. పోనీ కొడాలి నాని సవాల్ చేశారంటే ఓ అర్థముంది, అనిల్ కుమార్ యాదవ్ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారంటే ఆయనకు ఓ స్థాయి ఉంది. అయితే ఎన్నికల సమయంలో వైసీపీ పేరు చెప్పుకుని ఓ బ్యాచ్ మరీ శృతి మించిందనే విమర్శలున్నాయి. ఎవరీ శ్యామల, ఎందుకు ఆమెకు అంత ఆవేశం..? ఎవరీ శ్రీరెడ్డి, సోషల్ మీడియాలో ఆమె బూతులు తిడితే వైరి వర్గం ఊరుకుంటుందా..? రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన వారు, పవన్ కల్యాణ్ పై రోజా చేసిన విమర్శలను సమర్థిస్తారా..? ఇలాంటి తప్పులు ఆ పార్టీలో, ఈపార్టీలో చాలానే జరిగాయి. అప్పుడు పెద్ద స్థాయి నేతలు తిడుతుంటే ఆనందించారు, ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలు ఫలితం అనుభవిస్తున్నారు. వైరి వర్గాల్ని తిట్టిన పెద్ద నేతలకు పోలీసుల రక్షణగా నిలబడ్డారు, కానీ కార్యకర్తలు మాత్రం దాడులకు బలవుతున్నారు.
తప్పు ఎవరు చేసినా అది తప్పే. మేం చిన్న తప్పు చేశాం, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు అని ఎంచుకోవడంలో అర్థం లేదు. అధికారంలో ఉన్నవారు ఏం చేసినా పోలీసులు చేతులు కట్టుకోవడం ఇప్పుడే మొదలు కాలేదు. దీనికి బీజం చాన్నాళ్ల క్రితమే పడింది. ఎవరికి వారు ఆ సంప్రదాయాన్ని పెంచి పోషించారు. ఇకనైనా దీనికి అడ్డుకట్ట పడితే మంచిది. ఇప్పుడు దాడులు చేస్తున్న వారిని చూసి చంద్రబాబు, లోకేష్ సంతోషపడితే.. రేపు ప్రత్యర్థి వర్గానికీ ఓరోజు వస్తుంది, అప్పుడు టీడీపీ కార్యకర్తలు బాధపడాల్సి వస్తుంది. ఫైనల్ గా ఇక్కడ నాయకులు కాస్త సేఫ్ జోన్ లో ఉండగా.. కార్యకర్తలు అన్యాయంగా బలవుతున్నారు. నాయకుడు తొడ మాత్రమే కొట్టగలడు.. తల పగలగొట్టాల్సి వస్తే కార్యకర్త చేతిలోకే కర్ర వెళ్తుంది. ఇక్కడ గాయం చేసేవారు, గాయపడేవారు కూడా కార్యకర్తలే కావడం విశేషం. ఆ విషయం వారు తెలుసుకున్నప్పుడే ఈ దుష్టసంప్రదాయానికి తెరపడుతుంది.