మెగా వర్సెస్ దగా.. డీఎస్సీపై సోషల్ మీడియాలో యుద్ధం

మెగా డీఎస్సీ అంటే కనీసం 25వేల పోస్ట్ లయినా ఉంటాయని నిరుద్యోగులు ఆశపడ్డారు. కానీ కేవంల 16 వేల పోస్ట్ లకే నోటిఫికేషన్ విడుదలవడంతో కాస్త నిరాశ చెందారు.

Advertisement
Update:2024-06-14 09:45 IST

ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం పెట్టారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మెగా అంటే ఎన్ని పోస్ట్ లు అనేది చర్చనీయాంశమైంది. కేవలం 16,347 పోస్ట్ ల భర్తీకోసం నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని మెగా డీఎస్సీ అనుకోమంటే ఎలా అంటూ వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. పాతిక వేల పోస్ట్ లతో నోటిఫికేషన్ ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి, తొలి సంతకంతోనే నిరుద్యోగుల్ని చంద్రబాబు మోసం చేశారని సోషల్ మీడియాలో వైసీపీ విమర్శలు మొదలు పెట్టింది. వైసీపీ అనుకూల మీడియాలో కూడా మెగా డీఎస్సీపై పెద్ద చర్చ జరుగుతోంది. డీఎస్సీ పేరుతో యువతను చంద్రబాబు మోసం చేశారని అంటున్నారు.


వైసీపీ విమర్శలకు టీడీపీ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. పులివెందుల ఎమ్మెల్యే..! అంటూ జగన్ ని సంబోధిస్తూ టీడీపీ నుంచి ఓ ట్వీట్ పడింది. మెగా డీఎస్సీ, ప్రతి ఏటా గిరిజన డీఎస్సీ అని చెప్పి ఐదేళ్లపాటు జగన్ కాలయాపన చేశారని, అలాంటి వారు ఇప్పుడు టీడీపీ ఇచ్చిన నోటిఫికేషన్ గురించి విమర్శించటం శోచనీయం అంటున్నారు టీడీపీ నేతలు.


ఎవరిది న్యాయం..?

మెగా డీఎస్సీ అంటే కనీసం 25వేల పోస్ట్ లయినా ఉంటాయని నిరుద్యోగులు ఆశపడ్డారు. కానీ కేవంల 16 వేల పోస్ట్ లకే నోటిఫికేషన్ విడుదలవడంతో కాస్త నిరాశ చెందారు. అయితే చివరకు ఉద్యోగాలు కూడా ఇలా రాజకీయ విమర్శలకు వేదిక కావడమే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఉద్యోగాల భర్తీలో మేం వీరులం, మేం శూరులం అంటూ ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కూడా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య ఇదే విషయంలో విమర్శలు చెలరేగాయి. నోటిఫికేషన్లిచ్చిన ఘనత మాదేనంటూ బీఆర్ఎస్ చెబుతుంటే, అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చిన ఘనత తమదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో మాత్రం నోటిఫికేషన్లు, నెంబర్లు.. అంటూ గొడవ మొదలైంది. 

Tags:    
Advertisement

Similar News