ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్

AP Police Recruitment 2022: అభ్యర్థుల నుంచి ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు.

Advertisement
Update:2022-11-28 19:48 IST

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత మాత్రం నోటిఫికేషన్లే కరువయ్యాయి. ఎప్పుడు ఎక్కడ నిరుద్యోగులనుంచి డిమాండ్ వినిపించినా, సచివాలయ ఉద్యోగాల పేర్లు చెప్పి సైలెంట్ అయ్యేవారు మంత్రులు. మళ్లీ ఇప్పుడు పోలీస్ శాఖ తరపున భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం.

హోంగార్డ్ లకు రిజర్వేషన్..

420 ఎస్ఐ పోస్ట్ లను, 6,100 కానిస్టేబుల్ పోస్ట్ లను తాజా నోటిఫికేషన్లో భర్తీ చేస్తారు. వీటిలో 96 రిజర్వ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్లు, 3,580 సివిల్ కానిస్టేబుళ్లు, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్ట్ లు కూడా ఉన్నాయి. కానిస్టేబుల్‌ రిక్రూట్‌ మెంట్‌ లో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులలో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్‌ కల్పించారు.

రాతపరీక్ష తేదీలు..

అభ్యర్థుల నుంచి ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది.

ఇప్పటికే పోలీస్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు ఆలస్యమయ్యాయి. చాలామంది అభ్యర్థులు రాతపరీక్షలకోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల కావడంతో మరోసారి ఏపీ అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల బాట పట్టబోతున్నారు. హోంగార్డ్ లకు రిజర్వేషన్ ఉండటంతో.. చాలామంది ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News