లోకేష్ పాద యాత్రకు ఏపీ పోలీసుల గ్రీన్ సిగ్నల్.. కానీ..!

లోకేష్ పాదయాత్ర చేపట్టిందే ప్రభుత్వాన్ని విమర్శించడానికి. యువగళంలో విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కామన్. కానీ ఏపీ పోలీసులు లోకేష్ యాత్రకు అనుమతి ఇస్తూనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కండిషన్ పెట్టారు.

Advertisement
Update:2023-01-23 16:06 IST

లోకేష్ పాద యాత్రకు ఏపీ పోలీసుల గ్రీన్ సిగ్నల్.. కానీ..!

లోకేష్ పాదయాత్రకు అనుమతి ఎందుకివ్వడం లేదు..?

ఏపీలో ప్రభుత్వం నిరంకుశంగా ఎందుకు వ్యవహరిస్తోంది..?

జగన్ పాదయాత్ర టైమ్ లో మేం కూడా అలాగే అంటే ఏం చేసేవారు..?

తెలంగాణలో షర్మిల పాదయాత్రను అడ్డుకుంటే అంత గింజుకున్నారెందుకు..?

టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఈ ప్రశ్నలు హోరెత్తిపోతున్నాయి. ఈనెల 27నుంచి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. గతంలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ, ఇటీవల తెలంగాణలో విజయమ్మ చేసిన వ్యాఖ్యల్ని హైలెట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. అయితే ఈ హడావిడికి ఏపీ పోలీసులు బ్రేక్ వేశారు. లోకేష్ యాత్రకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ కండిషన్స్ అప్లై అన్నారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు..

లోకేష్ పాదయాత్ర చేపట్టిందే ప్రభుత్వాన్ని విమర్శించడానికి. యువగళంలో విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కామన్. కానీ ఏపీ పోలీసులు లోకేష్ యాత్రకు అనుమతి ఇస్తూనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కండిషన్ పెట్టారు. నిబంధనలకు లోబడి ఆయన పాదయాత్ర చేయాల్సి ఉంటుందని తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్, లోకేష్ యాత్రకు అనుమతి ఇచ్చినట్టు ప్రకటించారు. అయితే కండిషన్లు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. లోకేష్ యాత్రలో ఎక్కడైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వినిపిస్తే.. కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.

వారాహికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా..?

అటు పవన్ కల్యాణ్ కూడా వారాహి వాహనంలో యాత్రకు సిద్ధమవుతున్నారు. దీనిపై కూడా పోలీసులు స్పందించాల్సి ఉంది. ఆలివ్ గ్రీన్ వారాహి ఏపీ రోడ్లపైకి ఎలా వస్తుందో చూస్తామన్నారు మంత్రులు. మరి ఆ వాహనంలో పవన్ పర్యటనకు పోలీసులు అనుతిస్తారో లేదో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి లోకేష్ యువగళం యాత్రకు అనుమతి ఇచ్చి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు పోలీసులు. 400 రోజులపాటు, 4వేల కిలోమీటర్ల మేర లోకేష్ ఈ యాత్ర చేస్తారు. టీడీపీకి పునర్వైభవం తీసుకొస్తానంటున్న లోకేష్.. యాత్రను ఏ స్థాయిలో విజయవంతం చేస్తారో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News