కోట్ల ఆస్తి కాజేతకు విలేకరుల కుట్ర
అనంతపురం రూరల్ మండల పరిధిలోని రాచానపల్లి సమీపంలో వెంకట సుబ్బయ్య అనే వ్యక్తికి 14.96 ఎకరాల భూమి ఉంది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిపై నలుగురు టీవీ చానళ్ల రిపోర్టర్ల కన్ను పడింది.
వాళ్లు విలేకరులు.. సమాజంలో జరిగే మంచి చెడులను వార్తలుగా మలిచి ప్రజల ముందుంచడం వారి బాధ్యత. కానీ సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాల్సినవారు గతి తప్పారు. వేరొకరి ఆస్తిపై కన్నేసి.. దానిని హస్తగతం చేసుకునేందుకు సిద్ధమైపోయారు. పథకంలో భాగంగా కోట్ల రూపాయల ఆస్తిని వేరొకరికి అమ్మేసి ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. విషయం తెలిసి సదరు ఆస్తి యజమాని స్పందనలో ఫిర్యాదు చేయడంతో వారి బండారం బయటపడింది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అనంతపురం రూరల్ మండల పరిధిలోని రాచానపల్లి సమీపంలో వెంకట సుబ్బయ్య అనే వ్యక్తికి 14.96 ఎకరాల భూమి ఉంది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిపై నలుగురు టీవీ చానళ్ల రిపోర్టర్ల కన్ను పడింది. వారు పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగారు. ఒకరి పేరిట నకిలీ ఆధార్ కార్డు సృష్టించారు. ఆ భూమిని వేరొకరికి విక్రయించి, రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ వ్యవహారం భూ యజమాని వెంకట సుబ్బయ్య దృష్టికి వెళ్లడంతో.. అనంతపురం నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తికావడంతో స్పందనలోనూ ఫిర్యాదు అందజేశాడు. పోలీసుల విచారణలో విలేకరులు హనుమంతు, వేణుగోపాల్, రమేష్ పాత్ర వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మరో ప్రముఖ టీవీ చానల్ స్టాఫ్ రిపోర్టర్ పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ కుట్రలో మొత్తం ఎనిమిది మంది పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు ముందుగా ఈ నెల 12న అంపగాని శ్రీనివాసులును అరెస్టు చేశారు. అతన్ని విచారించగా బత్తల శేఖర్, అచ్చుకట్ల ఇంతియాజ్, కర్తనపర్తి సురేష్‌ల పేర్లు బయటపడ్డాయి. అనంతరం వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా టీవీ చానళ్ల విలేకరుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ తతంగం నడిపేందుకు రూ.14 కోట్లకు డీల్ కుదిరినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి రూ.75 లక్షలు చేతులు మారినట్టు తెలిసింది.