అక్రమ ఆయుధాల ముఠా అరెస్ట్.. - 18 ఆయుధాల స్వాధీనం
ఆయుధాల తయారీదారు, డీలర్ రాజ్‌పాల్‌సింగ్‌తో పాటు ఆయుధాల సరఫరా దారుగా ఉన్న సుతార్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ ఆయుధాల తయారీ ముఠాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఈ వివరాలు వెల్లడించారు. ఇటీవల అనంతపురం జిల్లాలో నకిలీ నోట్ల ముఠాలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా, అక్రమ ఆయుధాల ముఠా వ్యవహారం బయటపడింది. దీనిపై లోతైన దర్యాప్తు చేపట్టిన అనంతపురం జిల్లా స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ వీరి గుట్టంతా బయటపెట్టాయి. ఈ నిందితులు నకిలీ నోట్ల దందాతో పాటు అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలు కూడా చేస్తున్నారని గుర్తించారు. కర్నాటకలోని బెంగళూరుకు చెందిన ముఠా అనంతపురం, బళ్లారి కేంద్రాలుగా వివిధ రాష్ట్రాల్లో కిరాయి హత్యలకు పాల్పడుతూ నకిలీ నోట్ల ముద్రణ, చెలామణి చేస్తున్నట్టు గుర్తించారు.
మధ్యప్రదేశ్‌లో ఆయుధాల తయారీ..
విచారణలో భాగంగా బెంగళూరుకు చెందిన రౌడీషీటర్లు జంషీద్, ముబారక్, అమీర్ పాషా, రియల్ అబ్దుల్ షేక్ మహారాష్ట్రలోని సిర్పూర్ జిల్లా నుంచి గంజాయి, మధ్యప్రదేశ్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి 12 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ టీమ్ వారిని మరింత లోతుగా విచారించి కీలక సమాచారాన్ని రాబట్టింది. అనంతరం మధ్యప్రదేశ్‌లోని బర్వాని జిల్లాలో గల హిరేహాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించింది. ఆయుధాల తయారీదారు, డీలర్ రాజ్‌పాల్‌సింగ్‌తో పాటు ఆయుధాల సరఫరా దారుగా ఉన్న సుతార్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా ఆయుధాల అక్రమ సరఫరా..
మధ్యప్రదేశ్‌లోని డీలర్ల నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలతో బెంగళూరుకు చెందిన ముఠా సభ్యులు కర్నాటకలోని వివిధ ప్రాంతాల్లో దోపిడీలు, హత్యలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రాజ్‌పాల్‌సింగ్ దేశంలోని వందలాది ప్రాంతాలకు అక్రమ ఆయుధాల సరఫరా చేస్తున్నట్టుగా కూడా దర్యాప్తులో తేలింది. అరెస్టయిన నిందితులు ఆరుగురిపైనా ఏపీ, కర్నాటక మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో నకిలీ నోట్ రాకెట్, గంజాయి అక్రమ రవాణా, అక్రమ ఆయుధాలు, కిరాయి హత్యలకు సంబంధించిన కేసులు ముఖ్యమైనవి. నిందితుల నుంచి 95 రౌండ్ల బుల్లెట్లు, 6 అదనపు మ్యాగజైన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఈ సందర్భంగా డీజీపీ వెల్లడించారు. అసాంఘిక శక్తులను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.