ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త
సెప్టెంబర్-1 ఆదివారం సెలవు కాబట్టి రెండో తేదీ సోమవారం పెన్షన్లు పంపిణీ చేయొచ్చు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ముందురోజే పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. దీనివల్ల రెండు లాభాలున్నాయి.
ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే పెన్షన్ వారి చేతికి అందిస్తామని ప్రకటించింది. సెప్టెంబర్-1 ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఈమేరకు సచివాలయ సిబ్బందికి ఆల్రడీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 31న ఉదయాన్నే పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ఆరోజు పంపిణీ పూర్తి కాకపోతే సెప్టెంబర్-2వతేదీ మిగిలిన వారికి పెన్షన్లు ఇవ్వాలని సూచించారు.
సెప్టెంబర్-1 ఆదివారం సెలవు కాబట్టి రెండో తేదీ సోమవారం పెన్షన్లు పంపిణీ చేయొచ్చు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ముందురోజే పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. దీనివల్ల రెండు లాభాలు. పేదలకు తాము ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇస్తున్నామని విపరీతంగా ప్రచారం చేసుకోవచ్చు. రెండోది, ప్రతిపక్షానికి విమర్శలు చేసే అవకాశం లేకుండా చేయడం. గతంలో వైసీపీ కూడా ఇలాగే పెన్షన్లు పంపిణీ చేసింది. ఒకటో తేదీ సెలవు అయితే ముందురోజే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేసేది. సామాజిక పెన్షన్ల విషయంలో కరెక్ట్ గా టైమ్ మెయింటెన్ చేసిన జగన్, ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపుల్లో ఉదాసీనంగా ఉండటంతో ఎన్నికల్లో ఆయా వర్గాల అసంతృప్తి బయటపడింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా సామాజిక పెన్షన్ల పంపిణీపై ఎక్కడలేని ఆసక్తి చూపిస్తోంది. ఒకరోజు ముందుగానే నిధులు విడుదల చేసి, సచివాలయ సిబ్బందిని పెన్షన్ల పంపిణీకి సిద్ధం చేస్తున్నారు అధికారులు.
పెన్షన్ల పెంపు, పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి విమర్శలు ఎదుర్కోకపోవడం విశేషం. చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యిరూపాయల పెన్షన్ పెంచి, బకాయిలతో సహా వృద్ధులకు చెల్లించారు సీఎం చంద్రబాబు. వికలాంగులు, ఇతర వర్గాల పెన్షన్లు కూడా పెంచి ఇస్తున్నారు. ఈసారి ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ మొదలు పెడుతున్నారు.