అవును వాళ్లు గొట్టంగాళ్లే.. రాసుకోండి- కేశినేని మళ్లీ ఫైర్
అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదన్నారు. పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా.. ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా అని మొన్ననే చెప్పానని, అందులో తప్పేముందన్నారు.
టీడీపీ అధిష్టానంపై ఎంపీ కేశినేని నాని మరోసారి ఫైర్ అయ్యారు. తనను మహానాడుకు కూడా పిలవలేదని స్పష్టం చేశారు. విజయవాడ ప్రజలు తన వెంటే ఉన్నారన్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా తాను గెలుస్తానన్నారు. తనకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్న మాట వాస్తవమేనన్నారు. తాను మంచి వాడిని కాబట్టే ఆహ్వానాలు వస్తున్నాయన్నారు.
అమిత్ షాతో భేటీ గురించి తనకు తెలియదని, చంద్రబాబునే అడగాలన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని మిమ్మల్ని రమ్మన్నారని పీఏ ఫోన్ చేస్తే వెళ్లానని అంతకు మించి తనకు ఏమీ తెలియదన్నారు. తాను విజయవాడ ఎంపీని మాత్రమేనని.. పార్టీలో తనకు ఎలాంటి హోదా లేదన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడిని కాదు, కనీసం అధికార ప్రతినిధిని కూడా కాదన్నారు. బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇలా అన్ని పార్టీల నేతలతోనూ టచ్‌లోనే ఉంటానన్నారు.
రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో తనకు క్లారిటీ ఉందని ఎంపీ కేశినేని నాని చెప్పారు. అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదన్నారు. పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా.. ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా అని మొన్ననే చెప్పానని, అందులో తప్పేముందన్నారు. తనను గొట్టంగాడు అన్న వాడు, చెప్పుతో కొడుతా అన్న వాళ్లు కూడా పార్టీలో ఉన్నారంటూ అక్కడే ఉన్న ఫ్లెక్సీని చూపించారు. `పార్టీ ఇన్‌చార్జులు ఎవరు.. గొట్టంగాళ్లు` అంటూ మాట్లాడారు. ఇన్‌చార్జ్‌లు గొట్టంగాళ్లే రాసుకోండి అంటూ నొక్కి చెప్పారు.
మహానాడులో నా పాత్ర ఏమైనా ఉంటుందా అని అడిగా.. ఎంపీగా ఒక్క రామ్మోహన్‌నాయుడు మాత్రమే మాట్లాడుతారు అన్నారు అందుకే వెళ్లలేదన్నారు. ప్రోటోకాల్ సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారా అని ప్రశ్నించగా... నాకేం అవసరం అంటూ సమాధానమిచ్చారు. మహానాడుకు పిలవడం, పిలకపోవడం పార్టీ ఇష్టమన్నారు.
అయోధ్య రామిరెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారంటే తాను మంచివాడిని అనేగా అర్థం అని కేశినేని నాని అన్నారు. ప్రస్తుతానికి తాను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని.. పొమ్మనలేక పొగ పెడుతున్నారు.. ఆ మంట మరింత పెరిగినప్పుడు చూద్దాం అంటూ కేశినేని నాని కామెంట్స్ చేశారు.