ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియామకం
1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన్ను కొత్త ప్రభుత్వం డీజీపీగా నియమించింది.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్ మెంట్ కి కొత్త బాస్ వచ్చారు. నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన్ను కొత్త ప్రభుత్వం డీజీపీగా నియమించింది.
ఎన్నికల సమయంలో ఏపీ డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తా విధుల్లో చేరారు. అయితే ఆయన నియామకం కూడా కూటమికి ఇష్టం లేనట్టుంది. ఇప్పుడు ద్వారకా తిరుమలరావుకి బాధ్యతలు అప్పగించింది. వాస్తవానికి రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ తర్వాత ద్వారకా తిరుమలరావుకే డీజీపీ అవకాశం ఇస్తారని అనుకున్నారంతా. అప్పట్లో పురంద్రేశ్వరి ఈసీకి రాసిన లేఖలో కూడా ద్వారకా తిరుమలరావు పేరు సిఫార్సు చేశారు. కానీ ఆ నియామకం అప్పట్లో సాధ్యం కాలేదు. ఇప్పుడు కూటమి అధికారం చేపట్టాక ఆ నియామకం సునాయాసంగా జరిగిపోయింది.
ద్వారకా తిరుమలరావు టీడీపీ హయాంలో కీలక పోస్టుల్లో పనిచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన లూప్ లైన్ లోకి వెళ్లారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడాయన్ను మళ్లీ కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. పోలీస్ బాస్ గా నియమించింది. అధికారంలోకి వచ్చాక ఏపీ సీఎస్ తోపాటు, కీలక ఐఏఎస్ లకు స్థాన చలనం కలిగించిన ప్రభుత్వం.. తాజాగా పోలీస్ బాస్ ని మార్చేసింది. వివాద రహితుడిగా పేరున్న ద్వారకా తిరుమలరావుకి డీజీపీకి పోస్టింగ్ ఇచ్చింది.