టీడీపీ వెనకడుగు..! ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ లేనట్టేనా..?
సరిగ్గా నామినేషన్లు ముగిసే కొన్ని గంటల ముందు అభ్యర్థులను ప్రకటించిన చరిత్ర కూడా చంద్రబాబుకి ఉంది. ఆ హిస్టరీ ఇప్పుడు రిపీట్ చేస్తారా, లేక పోటీకి దూరంగా ఉంటారా..? వేచి చూడాలి.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈనెల 13 చివరి రోజు. ఈనెల 12న తన నామినేషన్ దాఖలు చేస్తానని వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే కూటమి తరపున ఎవరు అభ్యర్థి అనేది ఇంకా తేలలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో కూటమి పోటీకి దూరంగా ఉంటుందని తెలుస్తోంది. అభ్యర్థిపై ఇప్పటికే పలుదఫాలు పార్టీ నేతలతో చర్చించిన సీఎం చంద్రబాబు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్లకు మరో మూడు రోజులే టైమ్ మిగిలుంది. ఆగస్ట్-30న ఎన్నిక జరుగుతుంది. ఈలో గా అభ్యర్థిని బాబు ఖరారు చేసినా క్యాంప్ రాజకీయాలు నిర్వహించడం కష్టం. అంటే పోటీకి ముందే టీడీపీ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది.
వైసీపీకి సొంతగా 615మంది స్థానిక ప్రజా ప్రతినిధుల బలం ఉంది, కూటమిలోని మూడు పార్టీలను కలుపుకొన్నా వారికి ఉన్న ఓట్లు 215మాత్రమే. ఫిరాయింపుల్ని లెక్కలోకి తీసుకున్నా వైసీపీని ఓడించడం అంత సులభం కాదు. ఈలోగా వైసీపీ అభ్యర్థి బొత్స.. స్థానిక నేతల్ని క్యాంపులకి తరలించారు. అటునుంచి అటే ఆయన వారిని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి తీసుకొస్తారని తెలుస్తోంది. ఈ ఎన్నికలకోసం వైసీపీ పక్కా వ్యూహంతో వెళ్తోంది. దీంతో టీడీపీ వెనక్కి తగ్గినట్టే అనుకోవాలి.
కూటమి తరపున టీడీపీ అభ్యర్థిని నిలబెట్టినా.. ఇప్పటికిప్పుడు వైరి వర్గం నేతల్ని తమవైపు తిప్పుకోవడం అసాధ్యం అని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ తమ అభ్యర్థి ఓడిపోతే అది పరువు తక్కువ అవుతుంది. దాని బదులు పోటీకి దూరంగా ఉండటం మేలు అని బాబు భావిస్తున్నట్టు అర్థమవుతోంది. మెజార్టీ లేక, నీతి నిజాయితీతో తాము పోటీకి దూరంగా ఉన్నామని టీడీపీ చెప్పుకోవచ్చు. మరి చంద్రబాబు వ్యూహం ఏంటో వేచి చూడాలి. సరిగ్గా నామినేషన్లు ముగిసే కొన్ని గంటల ముందు అభ్యర్థులను ప్రకటించిన చరిత్ర కూడా చంద్రబాబుకి ఉంది. ఆ హిస్టరీ ఇప్పుడు రిపీట్ చేస్తారా, లేక పోటీకి దూరంగా ఉంటారా..? వేచి చూడాలి.