వలంటీర్లను టెరర్రిస్టులతో పోల్చుతారా? - ఏపీ మంత్రులు ఆగ్రహం
ప్రజలంతా వలంటీర్లను తమ సొంత బిడ్డల్లా ఆదరిస్తుంటే టీడీపీ, జనసేన మాత్రం నక్సలైట్లు, టెరర్రిస్టుల్లా పోలుస్తూ వారిని అవమానపరచడం బాధాకరమని మంత్రులు చెప్పారు.
వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతూ ఆరోపణలు చేసిన శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిపై ఏపీ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్ రెడ్డిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సోమవారం తాడేపల్లిగూడెం, తణుకులో విలేకరులతో మాట్లాడుతూ.. వలంటీర్లపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పింఛన్లు, సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు అత్యుత్తమ సేవలందిస్తున్న వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం టీడీపీ దుష్టపన్నాగాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.
ప్రజలంతా వలంటీర్లను తమ సొంత బిడ్డల్లా ఆదరిస్తుంటే టీడీపీ, జనసేన మాత్రం నక్సలైట్లు, టెరర్రిస్టుల్లా పోలుస్తూ వారిని అవమానపరచడం బాధాకరమని మంత్రులు చెప్పారు. మరో విషయం టీడీపీ, జనసేన నేతలు గుర్తుపెట్టుకోవాలని, వలంటీర్లు ఎక్కడినుంచో తీసుకొచ్చినవారు కాదని, ఆయా ప్రాంతాల్లోని 50 ఇళ్ల పరిధిలోని వారేనని వారు గుర్తుచేశారు. అంటే ఆ ప్రాంతాల్లోనివారి సొంత మనుషులే వలంటీర్లుగా ఉన్నారని మంత్రులు చెప్పారు.