షర్మిల పిచ్చివాగుడు.. మరోసారి రోజా ఘాటు వ్యాఖ్యలు
సీఎం జగన్ పై విషం చిమ్ముతూ, వైసీపీ ఓట్లు విభజించాలన్నదే షర్మిల ఉద్దేశమని చెప్పారు రోజా. వైఎస్ఆర్ శత్రువులతో షర్మిల చేతులు కలపడం చూస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు.
వైఎస్ఆర్ ని చంద్రబాబు దారుణంగా విమర్శించేవారు. ఆయన్ను షర్మిల ఎందుకు కలిశారు..?
వైఎస్ఆర్ ని ఉద్దేశించి పంచెలూడేలా కొడతానన్న పవన్ ని షర్మిల ఎందుకు కలిశారు..?
రేవంత్ రెడ్డి అవినీతి పరుడు, కోవర్టు అన్న షర్మిల.. పదే పదే ఆయన్ను ఎందుకు కలుస్తున్నారు..?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు మంత్రి రోజా సంధించిన సూటి ప్రశ్నలివి.
వైఎస్ఆర్ వారసురాలు అని చెప్పుకునే అర్హత షర్మిలకు లేదన్నారు రోజా. వైఎస్ఆర్ ని తూలనాడిన వారిని, ఆయన శత్రువులను కలుస్తూ ఆయన ఇమేజ్ కి మచ్చ తెస్తున్నారని మండిపడ్డారు. తన శత్రువులతో షర్మిల చేతులు కలపడం చూసి వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు రోజా.
ఇటీవల నగరి నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల, నేరుగా రోజాని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ఆల్రడీ బదులిచ్చారు రోజా. అయితే ఈరోజు మళ్లీ షర్మిలకి కౌంటర్లిచ్చారు. చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మడం మానేశారని, ఆయన బదులు పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చినా నమ్మడం లేదని, అందుకే ఇప్పుడు ఎల్లోబ్యాచ్ షర్మిలను రంగంలోకి దింపిందని.. అదే పాత స్క్రిప్ట్ ఆమె చేతికి ఇచ్చి పంపిస్తున్నారని మండిపడ్డారు రోజా. తెలంగాణలో వైఎస్సార్టీపీ తరపున పాదయాత్ర చేసి ఒక్కో నియోజకవర్గం వెళ్లి అక్కడి ఎమ్మెల్యేలపై విమర్శలు చేసిన షర్మిల... అదే ఫార్ములా ఏపీలో కూడా అప్లై చేస్తున్నారని అన్నారు. అక్కడ ఆ పార్టీని గాలికొదిలేసినట్టే.. ఇక్కడ కూడా ఆమె అదే చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి దెబ్బకు ఆమె ఏపీలో వచ్చి పడిందన్నారు రోజా.
ఏపీలో జగన్ మినహా రాజకీయాలు చేస్తున్న పార్టీల అధినేతలంతా నాన్ లోకల్స్ అంటూ ఎద్దేవా చేశారు మంత్రి రోజా. హైదరాబాద్ లో ఉంటూ ఎన్నికలప్పుడే చుట్టాల్లాగా ఏపీకి వస్తున్నారని విమర్శించారు. షర్మిలవి కూడా టైమ్‌పాస్ రాజకీయాలని, సీఎం జగన్ పై విషం చిమ్ముతూ, వైసీపీ ఓట్లు విభజించాలన్నదే షర్మిల ఉద్దేశమని చెప్పారు. చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడమే వారి ప్లాన్ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలని కానీ, రాష్ట్ర ప్రజలకు మంచి చెయ్యాలన్న ఆలోచన కానీ ఎల్లో బ్యాచ్ కి లేదన్నారు మంత్రి రోజా.