వైసీపీ రౌడీయిజం చేస్తే బాబు తట్టుకోగలరా..?

వాస్తవానికి ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా చంద్రబాబుకి లేదని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి.

Advertisement
Update:2022-07-14 13:54 IST

వైసీపీ రౌడీజియం చేస్తే చంద్రబాబు తట్టుకోలేరని, ఆయన కుప్పంలో గెలిచేవారు కూడా కాదని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీలో మైనింగ్ మాఫియా అంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మైనింగ్ మాఫియాకు పాల్పడింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు పెద్దిరెడ్డి. అసలు రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలోనే తప్పులు జరిగాయని, అప్పటి అక్రమాలపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కుప్పంలో జరుగుతున్న మాఫియాకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 మంది మైనింగ్ లీజుదారులకు 114 కోట్ల రూపాయలు జరిమానా విధించామని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. కుప్పంలో మైనింగ్ చేస్తోంది, టీడీపీ వాళ్లేనని ఆరోపించారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను శాటిలైట్ ద్వారా ఫొటోలు తీసి పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా చంద్రబాబు హయంలో జరిగిందని, 75 ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చంద్రబాబు ఇప్పుడు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చౌకబారు ఫొటోలు పెట్టి, ఫొటో ఎగ్జిబిషన్ అంటే నమ్మేస్తారా అని అడిగారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో చంద్రబాబు హయాంలోనే లేడీ తహసీల్దార్ పై దాడి జరిగిందని, ఆమె చీరలాగి, దాడి చేసింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు పెద్దిరెడ్డి.

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు హయంలో మైనింగ్ కి సంబంధించి కేంద్రం ఎప్పుడైనా అవార్డులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు పెద్దిరెడ్డి. మైనింగ్ విషయంలో మూడు సంవత్సరాలలో తమ ప్రభుత్వానికి రెండు సార్లు అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. కుప్పంను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు, అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకి స్ట్రాటజీలు లాంటివి ఏవీ ఉండవని, ఎన్టీఆర్ కి అల్లుడు కావడం వల్ల, ఆ అదృష్టంతో ముఖ్యమంత్రి అయ్యారని, వాస్తవానికి ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా చంద్రబాబుకి లేదని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి.

Tags:    
Advertisement

Similar News