బాబూ.. ఆ దమ్ముందా? - పవన్ ఎక్కడ నిలబడ్డా ఓడిస్తాం: జోగి రమేశ్
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి రాష్ట్రంలోని 86 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీచేయాలని సవాల్ విసిరారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. అప్పుడే పొలిటికల్ హీట్ పెరిగింది. వివిధ రాజకీయ పార్టీల నేతలు నిత్యం రాజకీయపరమైన విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ మాదిరిగానే తిరుగుతున్నారు. మరోవైపు పొత్తు రాజకీయాలపై కూడా జోరుగా చర్చ నడుస్తోంది.
తాజాగా మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి రాష్ట్రంలోని 86 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీచేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలోనే చుక్కలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఏదో రకంగా ఎన్నికల్లో గెలవాలని పొత్తుల కోసం అర్రులు చాస్తున్నారని వాపోయారు. పవన్ కల్యాణ్ ను తాము సీరియస్ గా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఆయన రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో పోటీచేసినా ఓడిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలవడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమ పార్టీని గెలిపిస్తాయని చెప్పుకొచ్చారు.