పాల్‌కి, ప‌వ‌న్‌కి మ‌ధ్య తేడా క‌నిపించ‌డం లేదు.. - మంత్రి బొత్స

నిన్ను ఎవ‌డు అడ్డుకుంటాడు.. స‌న్నాసి మాట‌లు ఎందుకు? అని ప‌వ‌న్‌ను మంత్రి బొత్స ప్ర‌శ్నించారు. రాజ్యాంగం, చ‌ట్టం అంటే ప‌వ‌న్‌కు తెలియ‌ద‌ని, రాజ్యాంగం, విలువ‌లు తెలిస్తే అలాంటి స‌న్నాసి మాట‌లు అత‌ని నోటివెంట రావ‌ని అన్నారు.

Advertisement
Update:2023-01-26 19:30 IST

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి స‌బ్జెక్ట్ లేదు, ఆయ‌న పార్టీకి విధానం లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. కేఏ పాల్‌కి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి మ‌ధ్య తేడా క‌నిపించ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. రాజ‌కీయాలు అంటే రెచ్చ‌గొట్ట‌డం కాద‌నే విష‌యం ప‌వ‌న్ తెలుసుకుంటే మంచిద‌ని ఆయ‌న చెప్పారు. అస‌లు రాబోయే త‌రాల‌కు ప‌వ‌న్ ఏం చెప్ప‌ద‌లుచుకున్నార‌ని మంత్రి బొత్స ప్ర‌శ్నించారు.

నిన్ను ఎవ‌డు అడ్డుకుంటాడు.. స‌న్నాసి మాట‌లు ఎందుకు? అని ప‌వ‌న్‌ను మంత్రి బొత్స ప్ర‌శ్నించారు. రాజ్యాంగం, చ‌ట్టం అంటే ప‌వ‌న్‌కు తెలియ‌ద‌ని, రాజ్యాంగం, విలువ‌లు తెలిస్తే అలాంటి స‌న్నాసి మాట‌లు అత‌ని నోటివెంట రావ‌ని అన్నారు. ఏమీ లేని ఇస్త‌రాకు లాగా ఎగిరెగిరి ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో రాజ్యాంగ‌బ‌ద్ధంగా, చ‌ట్ట‌బ‌ద్ధంగా పాల‌న సాగుతోంద‌ని మంత్రి చెప్పారు. ఎస్సీల‌కు జ‌గ‌న్ హ‌యాంలో ఎంత ల‌బ్ధి చేకూరిందో ప్ర‌తిప‌క్షాలు తెలుసుకోవాల‌న్నారు. డీబీటీ ద్వారా పేద‌ల‌కు నిధులు అందిస్తున్నామ‌ని, అవేమీ తెలుసుకోకుండా వాళ్ల‌ని కొడ‌తా.. వీళ్ల‌ని కొడ‌తా అంటే స‌రిపోతుందా అని ప్ర‌శ్నించారు. అస‌లు ఇలాంటి మాట‌ల ద్వారా సొసైటీకి ఏం చెప్పాల‌నుకుంటున్నావ్ అని ప‌వ‌న్‌ను మంత్రి బొత్స ప్ర‌శ్నించారు.

త‌మ పార్టీ విధానం వికేంద్రీక‌ర‌ణే అని ఈ సంద‌ర్భంగా మంత్రి స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాల‌న్న‌ది త‌మ ల‌క్ష్య‌మ‌ని, మూడు రాజ‌ధానులు, 26 జిల్లాలు త‌మ విధాన‌మ‌ని చెప్పారు. ఐదు కోట్ల ప్ర‌జ‌ల అభివృద్ధి త‌మ విధాన‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యం ఇంత‌కుముందూ చెప్పాం.. ఇప్పుడూ చెబుతున్నామ‌ని అన్నారు. ప‌వ‌న్ లాంటి వ్య‌క్తుల‌ను చూస్తుంటే రాజ‌కీయాల‌పై విర‌క్తి క‌లుగుతోంద‌ని బొత్స అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌కు ఒక్క అమ‌రావ‌తి అభివృద్ధి చెందితే చాల‌ని బొత్స విమ‌ర్శించారు. వారిది దోపిడీ విధాన‌మ‌ని, త‌మ‌ది అభివృద్ధి విధాన‌మ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News