ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.. జాగ్రత్త- మార్గదర్శిపై అంబటి కీలక వ్యాఖ్యలు

రామోజీరావు ఒక్క పైసా కూడా సొంత పెట్టుబడి పెట్టకుండా మార్గదర్శి ద్వారా వచ్చే సొమ్ముతోనే మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని అంబటి వివరించారు.

Advertisement
Update:2022-11-25 13:26 IST

రామోజీరావుకు చెందిన మార్గదర్శి కంపెనీలో చీటీలు వేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. మార్గదర్శి సంస్థ చట్టానికి విరుద్ధంగా నడుస్తోందని.. ఇలాంటి సంస్థకు ఏమైనా జరగొచ్చన్నారు. మార్గదర్శిలో వసూలు చేస్తున్న డబ్బును తీసుకెళ్లి.. రామోజీరావు తన సొంత కంపెనీల్లో పెట్టుబడిగా పెడుతున్నారని.. ఆ కంపెనీలు కుప్పకూలితే ఖాతాదారులు బజారున‌పడే అవకాశం ఉందన్నారు.

రామోజీరావు ఒక్క పైసా కూడా సొంత పెట్టుబడి పెట్టకుండా మార్గదర్శి ద్వారా వచ్చే సొమ్ముతోనే మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని అంబటి వివరించారు. మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్‌లో ఇటీవల జరిగిన సోదాల్లో పలు కీలకమైన విషయాలు బయటపడ్డాయని చెప్పారు.

ప్రతి చీటీకి వేరువేరుగా అకౌంట్ ఓపెన్ చేయాలని.. కానీ మార్గదర్శిలో మాత్రం మొత్తం అందరి సొమ్ముకు ఒక్క‌ ఖాతా ద్వారానే నిర్వహిస్తున్నారని, ఇదిచట్ట విరుద్దమని అంబటి చెప్పారు. చీటీలు పాడితే వెంటనే సొమ్ము ఇవ్వాల్సి ఉన్నా ష్యూరిటీలు సరిగ్గా లేవంటూ నాలుగైదు నెలల పాటు సొమ్ము ఇవ్వకుండా తిప్పుతున్నారని.. ఆ లోపు ఆ సొమ్మునంతా ఇతర ఖాతాల్లోకి మళ్లించి వ్యాపారం చేసుకుంటున్నారని వివరించారు. ఈ పద్దతితో వేల కోట్ల రూపాయల రిజర్వ్‌ సొమ్మును రొటేట్ చేస్తూ సొంత వ్యాపార సంస్థలకు మళ్లిస్తున్నారని అంబటి వెల్లడించారు.

సరైన వ్యక్తినే ష్యూరిటీకి తీసుకెళ్లినా సరే, మూడు నాలుగు నెలల పాటు సొమ్ము ఇవ్వడం లేదన్నారు. అసలు చిట్‌ఫండ్ కంపెనీ నిర్వహిస్తున్న వారు మరో వ్యాపారం చేయడానికి చట్టం అనుమతించదని.. కానీ, రామోజీరావు మాత్రం పదుల సంఖ్యలో ఇతర వ్యాపారాలు చేస్తున్నారని.. అందుకు అవసరమైన సొమ్మును కూడా ఈ చిట్‌ ఫండ్ కంపెనీ నుంచే తరలిస్తున్నారని అంబటి వివరించారు. ఫిల్మ్‌ సిటీలో పనిచేసే ఉద్యోగులకు కూడా మార్గదర్శి సంస్థ నుంచే జీతాలు ఇస్తున్న విషయం కూడా బయటపడిందన్నారు. ఇంతకంటే అక్రమం మరొకటి ఉండదన్నారు.

సోదాలు నిర్వహిస్తే కక్ష సాధింపు అనడం ఏమిటని ప్రశ్నించారు. దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుంటే ఎస్‌ఐకి తన మీద కోపం ఉందని అందుకు పట్టుకున్నారంటే కుదురుతుందా అని అంబటి నిలదీశారు. పైగా ఖాతాదారులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా.. సొమ్మును తిరిగి చెల్లిస్తున్నాం కదా అని రామోజీరావు మాట్లాడుతున్నారని... దొంగతనం చేసిన తర్వాత ఆ విషయం బయటపడితే... సొమ్ము తిరిగి ఇచ్చేస్తా తనపై కేసు పెట్టవద్దు అంటే చెల్లుబాటు అవుతుందా అని అంబటి ప్రశ్నించారు.

రామోజీరావు మార్గదర్శి సొమ్మును ఇతర కంపెనీలకు మళ్లించారని.. ఆ కంపెనీలు కుప్పకూలితే డబ్బులు చెల్లించిన వారంతా రోడ్డునపడుతారని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అంబటి సూచించారు.

Tags:    
Advertisement

Similar News