ఏపీలో ఇంటర్ మరణాలు.. 9మంది ఆత్మహత్య
అనంతపురం జిల్లాకు చెందిన మహేష్ పరీక్షలకు హాజరు కాలేదు. ఫలితాలు వచ్చాక తల్లిదండ్రులకు ఆ విషయం తెలిసింది, వారు నిలదీయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
పరీక్షల ఫలితాలు విడుదలవుతున్నాయంటే విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన మొదలవుతోంది. అప్పటి వరకు బాగానే ఉన్న పిల్లలు, పరీక్షల్లో ఫెయిలయితే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత బలవన్మరణాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలైన రెండు రోజుల్లోపు 9మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
పరీక్షల్లో ఫెయిలైనవారితోపాటు, పాసైనవారిలో కొందరు మార్కులు తక్కువగా వచ్చాయనే కారణంతో ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగించే విషయం. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఇంటర్ విద్యార్థిని అనూష, బైరెడ్డిపల్లెకు చెందిన బాబు అనే విద్యార్థులు పరీక్ష ఫెయిలవడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. పాస్ అయినా మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతో అనకాపల్లికి చెందిన కరుబోతు తులసీ కిరణ్ అనే విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, ఎన్టీఆర్ జిల్లాకు చెందినవారు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లాకు చెందిన మహేష్ పరీక్షలకు హాజరు కాలేదు. ఫలితాలు వచ్చాక తల్లిదండ్రులకు ఆ విషయం తెలిసింది, వారు నిలదీయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
పరీక్ష ఫలితాల్లో అట్టడుగున ఉన్న విద్యాశాఖ మంత్రి సొంత జిల్లా విజయనగరంలో కూడా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయనగరం జిల్లాలో పురుగుల మందు తాగి ఒకరు, చీమలమందు తాగి మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులంతా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నవారు, సింగిల్ పేరెంట్ ఉన్నవారు, మధ్యతరగతికి చెందినవారు కావడం గమనార్హం.