ఏపీ ఇంటర్ ఫలితాలు.. అబ్బాయిల పాస్ పర్సంటేజ్ కేవలం 58శాతం
పాసైన వారిలో బాలికలు 65 శాతం, బాలురు 58శాతం. సెకండ్ ఇయర్ ఫలితాల్లో విద్యాశాఖ మంత్రి బొత్స సొంత జిల్లా విజయనగరం చివరి స్థానంలో ఉండటం గమనార్హం.
అకడమిక్ పరీక్షలు, పోటీ పరీక్షల ఫలితాలు విడుదలైతే ఇటీవల కామన్ గా వినిపించే మాట బాలికలదే పైచేయి. ఈసారి ఏపీ ఇంటర్ ఫలితాల్లో కూడా బాలికలదే పైచేయి. విశేషం ఏంటంటే.. బాలుర పాస్ పర్సంటేజ్ మరీ తక్కువగా నమోదు కావడం. అవును, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలకు ఆమడదూరంలో నిలిచిపోయారు బాలురు. పాస్ పర్సంటేజ్ లో తీసికట్టుగా మారారు.
ఏపీలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 4,33,275 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందులో 2,66,326 (61శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. పాసైన వారిలో బాలికలు 65 శాతం, బాలురు 58శాతం.
బొత్స సొంత జిల్లాకు ఆఖరి స్థానం..
ఇంటర్ సెకండ్ ఇయర్ విషయానికొస్తే.. పరీక్షలకు హాజరైనవారు 3,79,750 మంది. పాసైన వారి సంఖ్య 2,72,001 పాస్ పర్సంటేజ్ -72శాతం. ఇక్కడ కూడా బాలికలదే హవా. బాలికలు75శాతం పాసవగా.. బాలురు కేవలం 58 శాతం మంది మాత్రమే పాసయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 75శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా 70శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, 68 శాతంతో పశ్చిమగోదావరి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 83శాతం ఉత్తీర్ణతతో కృష్ణా మొదటి స్థానంలో నిలవగా, 78శాతం ఉత్తీర్ణతతో గుంటూరు రెండో స్థానం, 77శాతంతో పశ్చిమగోదావరి మూడో స్థానంలో నిలిచాయి. సెకండ్ ఇయర్ ఫలితాల్లో విద్యాశాఖ మంత్రి బొత్స సొంత జిల్లా విజయనగరం చివరి స్థానంలో ఉండటం గమనార్హం.
ఏప్రిల్ 27 నుంచి మే 6వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఫెయిల్ అయిన వారికోసం మే 24 నుంచి జూన్1 వరకు వరకు రెండు విడతల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు త్వరలో విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ తెలిపింది.