హైకోర్టు అరుదైన నిర్ణయం.. - లైంగిక దాడి కేసులో రాజీకి అనుమతి
సుప్రీం కోర్టు దండపాణి కేసులో పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా పేర్కొంది. ఇప్పుడు దానినే ఉదాహరణగా చూపుతూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
లైంగిక దాడి కేసులో రాజీకి అనుమతి ఉండదు. లైంగిక దాడి కేసులో రాజీ చేయడానికి వీల్లేదని జ్ఞాన్‌సింగ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు కూడా చెప్పింది. అయితే అదే సుప్రీం కోర్టు దండపాణి కేసులో పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా పేర్కొంది. ఇప్పుడు దానినే ఉదాహరణగా చూపుతూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
తనతో సంబంధాన్ని తెంచుకుని మరో యువతితో వివాహానికి సిద్ధమైన యువకుడిపై ఓ యువతి గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై లైంగిక దాడి, మోసం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆ యువతి కూడా దీనికి అనుబంధ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది.
రాజీకి అనుమతించాలంటూ ఇద్దరూ తమ పిటిషన్లలో హైకోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కోర్టు ముందు హాజరయ్యారు. తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించాడన్న కోపంతోనే తాను ఫిర్యాదు చేశానని ఆ యువతి కోర్టుకు వెల్లడించింది. తమ వివాదం ముగిసిందని, ఫిర్యాదు ఉపసంహరించుకుంటానని న్యాయమూర్తి ఎదుట తెలిపింది. ఎవరి జీవితాలు వారు గడుపుతామని నివేదించింది.
వారి ఇద్దరి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు రాజీకి అనుమతిస్తున్నట్టు తీర్పులో పేర్కొన్నారు. సాధారణంగా లైంగిక దాడి కేసులో రాజీకి ఆస్కారం లేకపోయినప్పటికీ.. ఫిర్యాదుకు దారితీసిన పరిస్థితులు, ఇరుపక్షాలు రాజీ చేసుకుని ఎవరి జీవితాలు వారు గడిపేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో రాజీకి అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయమూర్తి ప్రస్తావించారు.