హైకోర్టులో కొందరి గుత్తాధిపత్యాన్ని కట్టడి చేయాల్సి ఉంది- హైకోర్టు

కీలకమైన ఈ విభాగంపై కొందరికే గుత్తాధిపత్యం దక్కకుండా నివారించవచ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు. జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు

Advertisement
Update:2022-12-13 10:55 IST

ఏపీ హైకోర్టులోని జ్యుడీషియల్ విభాగంలో కొందరు ఉద్యోగులు గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి వారి కారణంగా న్యాయవాదులు, పిటిషనర్లు ఇబ్బందిపడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. సుదీర్ఘకాలం పాటు కొందరు ఉద్యోగులు హైకోర్టులోని ఇతర విభాగాలతో సంబంధం లేకుండా కీలకమైన జ్యుడీషియల్ విభాగంలోనే ఉండిపోవడం వల్ల ఈ గుత్తాధిపత్యం ఏర్పడుతోందని కోర్టు అభిప్రాయపడింది.

జ్యుడీషియల్ విభాగంలో పనిచేస్తున్న వారి ప్రభావం నేరుగా కోర్టు మీద ఉంటుందని వివరించింది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కోర్టు కొన్ని సూచనలు చేసింది. ఏటా జ్యుడీషియల్ విభాగంలో పనిచేస్తున్న వారిలో 30 శాతం మందిని హైకోర్టులోని ఇతర విభాగాలకు బదిలీ చేయాలని కోర్టు సూచించింది. ఇతర విభాగాల్లోని వారిని జ్యుడీషియల్ విభాగంలోకి తీసుకురావాలంది. అలా చేయడం వల్ల ఇతర విభాగాల్లోని వారికి కూడా జ్యుడీషియల్ విభాగంలో పనిచేసిన అనుభవం వస్తుందని.. కీలకమైన ఈ విభాగంపై కొందరికే గుత్తాధిపత్యం దక్కకుండా నివారించవచ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు. జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

అటు.. మరో కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం న్యాయవాదుల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులు విధులు బహిష్కరించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని.. అలా చేయడం అంటే కోర్టు ధిక్కరణకు పాల్పడడమే ధర్మాసనం వ్యాఖ్యానించింది. గుంటూరు జిల్లా కోర్టు న్యాయవాదులు పదేపదే కోర్టు విధులను బహిష్కరిస్తున్నారని.. దీని వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయంటూ న్యాయవాది సాంబిరెడ్డి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Tags:    
Advertisement

Similar News