ఖైదీల క్షమాభిక్షలో ప్రభుత్వ పరిధిని తేలుస్తాం - ఏపీ హైకోర్టు
ప్రభుత్వానికి అధికారం ఉంది కదా అని జీవిత ఖైదు పడిన వ్యక్తిని ఆరు నెలలకే విడుదల చేయవచ్చా అని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది.
ఖైదీల విడుదల విషయంలో ప్రభుత్వానికి ఉండే అధికారాల పరిమితిని నిర్ణయిస్తామని ఏపీ హైకోర్టు ప్రకటించింది. ప్రభుత్వానికి అధికారం ఉంది కదా అని జీవిత ఖైదు పడిన వ్యక్తిని ఆరు నెలలకే విడుదల చేయవచ్చా అని ప్రశ్నించింది.
నెల్లూరు జిల్లాకు చెందిన పార్థమ రెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో 8 మందికి గతంలో జీవిత ఖైదు పడింది. వారికి ఈ ఏడాది ఆగస్ట్ 15న ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ మృతుడి భార్య హైకోర్టును ఆశ్రయించారు. చట్టవిరుద్ధంగా ప్రభుత్వం పాలసీ తయారు చేసి ఖైదీలను విడుదల చేసిందని ఆమె తరపు న్యాయవాది వాదించారు.
జీవిత ఖైదు పడిన వారు కనీసం 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాలని కానీ వీరి విషయంలో దాన్ని పక్కనపెట్టారని వాదించారు. 14 ఏళ్ల శిక్ష పూర్తికాకుండానే దోషులను విడుదల చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గవర్నర్‌కు కూడా వివరించినట్టుగా లేదని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కనీసం 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదని, మంచి ప్రవర్తన కలిగి ఉన్నవారిని విడుదల చేయవచ్చన్నారు. ఇందుకు స్పందించిన న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్... ప్రభుత్వ అధికారాల విషయంలో తమకు ఎలాంటి అనుమానం లేదని.. కాకపోతే అధికారం ఉంది కదా అని జీవిత ఖైదు పడిన వారిని ఆరు నెలలకే విడుదల చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశంపై తాము విచారణ కొనసాగిస్తామని.. ఖైదీల విడుదలలో ప్రభుత్వానికి అపరిమిత అధికారాలున్నాయా అన్నది తాము పరిశీలన చేసి తేలుస్తామని విచారణను కోర్టు వాయిదా వేసింది.