అమరావతివాదులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు
అమరావతివాదుల పాదయాత్రకు డీజీపీ అనుమతి నిరాకరించినప్పటికీ కోర్టు మాత్రం యాత్రకు అనుమతి ఇచ్చింది. పరిమిత ఆంక్షలతో యాత్ర కొనసాగించాలని ఆదేశించింది.
అమరావతివాదులకు హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని అమరావతివాదులు ప్రకటించగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. పాదయాత్ర కారణంగా శాంతిభ్రదతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనుమతి నిరాకరించారు. అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులను అమరావతి పరిరక్షణ సమితి నాయకులకు పంపారు.
అమరావతి పరిరక్షణ సమితి విజ్ఞప్తిని వివిధ జిల్లాల ఎస్పీలకు పంపి వారి అభిప్రాయాలను తీసుకున్నామని వారు కూడా పాదయాత్ర వల్ల ఇబ్బందులు వస్తాయని అభిప్రాయపడినట్టు వివరించారు. గతేడాది అమరావతి నుంచి తిరుమలకు పాదయాత్ర చేసిన సమయంలో కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించిన అంశాన్ని డీజీపీ ప్రధానంగా ప్రస్తావించారు. గత పాదయాత్ర సమయంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేశారని గుర్తుచేశారు. దాని వల్ల గత పాదయాత్ర సమయంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 77 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని వివరించారు.
ఇప్పుడు పాదయాత్ర తలపెట్టిన మార్గంలో మూడు రాజధానులపై ఆకాంక్షలున్న ప్రజలూ ఉన్నారని, విశాఖ మీదుగానే యాత్ర వెళ్తుందని కాబట్టి ఇబ్బందులు వస్తాయన్నారు. పైగా 200 మందితో యాత్ర చేస్తామంటూనే ఎక్కువ మంది వస్తే బృందాలుగా వెళ్తామని చెబుతున్నారని.. అంటే ఎంత మంది, ఎవరెవరు యాత్రలో పాల్గొంటారన్న దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారని డీజీపీ ప్రస్తావించారు. యాత్రను పర్యవేక్షించడం అధికారులకు ఇబ్బంది అవుతుందని, శాంతిభద్రతల సమస్యకు అవకాశం ఉందని, కాబట్టి పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నామని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతోంది. పోలీసుల స్పందన తర్వాత కేసును శుక్రవారం విచారిస్తామని నిన్నచెప్పిన హైకోర్టు.. నేడు తొలి కేసుగా పాదయాత్ర అనుమతి అంశాన్ని విచారించింది. పాదయాత్రకు డీజీపీ అనుమతి నిరాకరించినప్పటికీ కోర్టు మాత్రం యాత్రకు అనుమతి ఇచ్చింది. పరిమిత ఆంక్షలతో యాత్ర కొనసాగించాలని ఆదేశించింది. మరోసారి పోలీసులకు తక్షణం దరఖాస్తు చేసుకోవాలని, దాన్ని పరిశీలించి అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశించింది. ఈనెల 12 నుంచి నవంబర్ 11 వరకు యాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో 600 మంది వరకు పాల్గొనేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.