నెగెటివ్ ప్రచారం కాదు కదా..? బిగ్ బాస్ పిటిషన్ పై ఏపీ హైకోర్ట్ అనుమానం..

బిగ్‌ బాస్‌ రియాల్టీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు అందులో ఏముందో తెలుసుకునేందుకు తామూ రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది.

Advertisement
Update:2022-10-12 07:19 IST

"అబ్బబ్బ ఆ షో అదిరిపోయింది." ఈ మాట చెబితే జనాలకు పెద్దగా ఇంట్రస్ట్ ఉండదు. "అబ్బో ఆ టీవీ షోలో అన్నీ బూతులే." ఈమాట వినిపిస్తే చాలామందికి మరింత ఆసక్తి కలుగుతుంది, ఎలాగైనా ఆ టీవీ షోని చూడాలనిపిస్తుంది. దీన్నే నెగెటివ్ పబ్లిసిటీ అంటారు. ఏపీ హైకోర్టుకి కూడా ఇదే అనుమానం వచ్చింది. బిగ్ బాస్ రియాల్టీ షో ని నిలుపుదల చేయాలంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ సందర్భంలో ఈ అనుమానం వ్యక్తం చేసింది. పిటిషన్లతో కావాలనే ఆ రియాల్టీ షో కి నెగెటివ్ ప్రచారం కల్పిస్తున్నారా అని ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని పిటిషనర్ తరపున న్యాయవాది వివరించారు.

బిగ్‌ బాస్‌ రియాల్టీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు అందులో ఏముందో తెలుసుకునేందుకు తామూ రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. ఎలాంటి సెన్సార్‌ షిప్‌ లేకుండా ఈ షో ప్రసారమవుతోందని ఇటీవల రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 2019లో కూడా ఇలాంటి పిల్ దాఖలైంది. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్ట్.. తొలి విచారణలో కాస్త ఘాటుగా స్పందించింది. గతంలో ఎలాంటి సినిమాలొచ్చాయి, ఇప్పుడు ఎలా తయారయ్యాయో తమకు తెలుసని చెప్పింది. తాజా విచారణలో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఎలాంటి సెన్సార్‌ షిప్‌ లేకుండా బిగ్‌ బాస్‌ షో ప్రసారం అవుతోందనేది పిటిషనర్ల వాదన. దీనికి సంబంధించిన ఫొటోలను పరిశీలించాలని హైకోర్టుని వారు కోరారు. ఈ పోటీలో పాల్గొనే మహిళలకు ప్రెగ్నెన్సీ పరీక్షలు కూడా చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై స్పందించిన ధర్మాసనం.. తాము కూడా రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News