అంతా బీటెక్కే.. గ్రూప్స్ లోనూ టాపర్స్ వాళ్లే

ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాలకు జరిగిన పోటీ పరీక్షల తుది ఫలితాలు విడుదల కాగా మొత్తం 110 మంది ఎంపికయ్యారు. వీరిలో జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారు 35 మంది ఉన్నారు. అంటే దాదాపు మూడోవంతు ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీలనుంచి వచ్చినవారు కావడం విశేషం.

Advertisement
Update:2023-08-18 08:23 IST

గతంలో గ్రూప్1, 2 పరీక్షల ఫలితాలు విడుదలైతే.. టాపర్స్ కచ్చితంగా సాధారణ డిగ్రీ, లేదా పీజీ, లేదా ఎంఫిల్.. రీసెర్చ్ స్కాలర్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధారణ డిగ్రీ చదివే విద్యార్థుల సంఖ్య కూడా బాగా తగ్గిపోతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 ఫైనల్ ఫలితాల్లో టాప్-4 లో ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్ ఉండటం విశేషం.

ఐఐటీ, ఐఐఎం.. అన్ని దార్లూ ఇటువైపే

ఇటీవల కాలంలో హైస్కూల్ నుంచే విద్యార్థులను ఐఐటీ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. 8, 9 తరగతుల్లోనే ఇంటర్ సిలబస్ పూర్తి చేసి, ఇంటర్లో పూర్తిగా ఐఐటీ కోసం సానబెడుతున్నారు. ఇలాంటి పోటీ ఆరోగ్యకరమైనదే అని చెప్పలేం కానీ, విద్యార్థుల్లో కాంపిటీటివ్ స్పిరిట్ బాగా పెరుగుతోంది. అదే సమయంలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థల్లో చదివిన వారు కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నతోద్యోగాలకోసం ప్రయత్నిస్తున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఏడాదికి కోటి రూపాయలిచ్చే జీతం ఉన్నా కూడా అంతిమంగా తమ లక్ష్యం మాత్రం ప్రభుత్వ ఉద్యోగమే అని చెబుతున్నారు. అలాంటి వారంతా ఈసారి ఏపీలో గ్రూప్-1 టాపర్స్ గా నిలిచారు.

ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాలకు జరిగిన పోటీ పరీక్షల తుది ఫలితాలు విడుదల కాగా మొత్తం 110 మంది ఎంపికయ్యారు. వీరిలో ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM), ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT), బిర్లా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (BITS), నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT), ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (IIIT) వంటి జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారు 35 మంది ఉన్నారు. అంటే దాదాపు మూడోవంతు ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీలనుంచి వచ్చినవారు కావడం విశేషం.

సాధారణ డిగ్రీలతో ఇప్పుడు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకే విద్యార్థులంతా బీటెక్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు రంగంలో మంచి జీతాలతో కొలువులు దక్కుతాయనే గ్యారంటీతోపాటు.. తమకి ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకోసం ప్రయత్నించే అవకాశం కూడా ఉండటంతో విద్యార్థులు ఇంజినీరింగ్ పై మక్కువ పెంచుకుంటున్నారు. అదే సమయంలో ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన వారు కూడా జీతం కంటే మంచి హోదా ఉన్న ఉద్యోగాలు కావాలని ఆశపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News