అంగన్వాడీలకు డెడ్ లైన్.. వేటు వేసేందుకు ప్రభుత్వం రెడీ
ప్రభుత్వం కూడా తగ్గేది లేదంటోంది. జీతాలు పెంచలేమని తేల్చి చెప్పింది. గ్రాట్యుటీ విషయం తమ పరిధిలో లేదన్నది. పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరకు వార్నింగ్ ఇస్తూ అంగన్వాడీ సంఘాలకు నోటీసులు జారీ చేసింది.
ఏపీలో అంగన్వాడీల సమ్మె పీక్ స్టేజ్ కి చేరుకుంది. 22 రోజులుగా వారు చేస్తున్న సమ్మె సుఖాంతం అయ్యేందుకు ఛాన్స్ లు కనుమరుగయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వం వారికి డెడ్ లైన్ విధించింది. ఈనెల 5 వతేదీ లోగా సమ్మె విరమించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం.
అంగన్వాడీల సమ్మె విషయంలో ఇరు వర్గాలు తగ్గేది లేదంటున్నాయి. జీతం పెంచాలి, గ్రాట్యుటీ సంగతి తేల్చాలంటూ అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. ప్రతిపక్షాలు వారిని మరింతగా రెచ్చగొట్టడంతో 22 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దున్నపోతులకు, కోతులకు అర్జీలివ్వడం, ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతూ నినాదాలివ్వడం వంటి రెచ్చగొట్టే ప్రదర్శనలు కూడా జరిగాయి. 22 రోజులుగా విధులకు హాజరు కాకుండా రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు అంగన్వాడీలు.
ఇటు ప్రభుత్వం కూడా తగ్గేది లేదంటోంది. జీతాలు పెంచలేమని తేల్చి చెప్పింది. గ్రాట్యుటీ విషయం తమ పరిధిలో లేదన్నది. పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరకు వార్నింగ్ ఇస్తూ అంగన్వాడీ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. 5వతేదీలోగా విధుల్లో చేరాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఏం జరుగుతుంది..?
ఇన్నిరోజులపాటు సమ్మె చేసి ఇప్పుడు బేషరతుగా విధుల్లో చేరితే తమ భవిష్యత్ ఏంటనేది అంగన్వాడీల ఆలోచన. అదే సమయంలో ప్రభుత్వంతో పట్టుదలకు పోతే మొదటికే మోసం వస్తుందనే భయం కూడా వారిలో ఉంది. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి, సచివాలయ సిబ్బందితో పనికానిచ్చేస్తోంది ప్రభుత్వం. ఇంకా అంగన్వాడీలు సమ్మెలోనే ఉంటామని భీష్మిస్తే.. ప్రభుత్వం కనికరించడం కష్టం. ఇలాంటి దశలో అంగన్వాడీలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.