ఏపీలో కూల్ కూల్.. జీవోతో చల్లబడిన ఉద్యోగులు
ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల్లో మంత్రి బొత్స .. వరుస జీవోలు విడుదలవుతాయని హామీ ఇచ్చారు. కానీ మేం నమ్మలేం అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు కార్యాచరణ ప్రకటించారు. ఈ కార్యాచరణ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ప్రభుత్వం జీవో ఇచ్చింది.
ఏపీలో వాతావరణం చల్లబడింది. ఉద్యమాలంటూ కార్యాచరణ ప్రకటించి వేడివేడిగా ఉన్న ఉద్యోగులు కూడా సాయంత్రానికి కాస్త చల్లబడ్డారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు మే డే గిఫ్ట్ ఇచ్చారు సీఎం జగన్. అయితే ఇదేమీ సర్ ప్రైజ్ గిఫ్ట్ కాదు. గతంలో ఇచ్చిన హామీనే ఈరోజు జీవో రూపంలో అమలులో పెట్టారు. దీని ఫలితం కూడా రెండు నెలల తర్వాత, అంటే జులై-1న అకౌంట్ లో పడే జీతాలతో అందుతుందనమాట.
ఏంటా బహుమతి..?
సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి-1 నుంచి ఇవ్వాల్సిన డీఏ బకాయిని మంజూరు చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. జీవో ఎం.ఎస్. నెంబర్ 66 ద్వారా ఉద్యోగులకు డీఏ బకాయిలు, జీవో ఎం.ఎస్. నెంబర్ 67 ద్వారా పెన్షనర్లకు 2.73 శాతం డీఆర్ మంజూరు చేశారు. ఈ కొత్త డీఏను జూలై 1 నుంచి జీతంతో కలసి ఉద్యోగులు అందుకుంటారు. జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్ మరియు మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని గతంలోనే సీఎం జగన్ హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు అమలులో పెట్టారు, జీవో ఇచ్చారు.
కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల మొత్తం డీఏ 22.75 శాతం అవుతుంది. పాత హామీయే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని అమలులో పెట్టి జీవో విడుదల చేసినందుకు సీఎం జగన్ కి ప్రభుత్వ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల్లో మంత్రి బొత్స .. వరుస జీవోలు విడుదలవుతాయని హామీ ఇచ్చారు. కానీ మేం నమ్మలేం అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు కార్యాచరణ ప్రకటించారు. ఈ కార్యాచరణ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో ఉద్యోగులు కాస్త చల్లబడ్డారు.