చంద్రన్నకు చెబుదాం.. టోల్ ఫ్రీ నెంబర్ విడుదల

నిజంగా సమస్యల తీవ్రత, వాటి ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం ఇస్తే బాధితులు తమ బాధలు తీరిపోతాయని గట్టిగా నమ్ముతారు.

Advertisement
Update:2024-06-30 16:58 IST

ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ఓ టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసింది. అయితే ఇది పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమంగా తెలుస్తోంది. ఈ నెంబర్ ను టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విడుదల చేయడం విశేషం. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఈ వినతులను వినే అవకాశముంది. ప్రజలు వారి సమస్యలను 73062 99999 నెంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయాలని, ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం వారికి కల్పిస్తామని తెలిపారు పల్లా. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో స్పందన పేరుతో అధికారులు అర్జీలు స్వీకరిస్తుండగా.. కూటమి ప్రభుత్వం కొత్త వెబ్ సైట్ ని తీసుకొచ్చింది. నేరుగా నేతలే ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా మొబైల్ నెంబర్ ని అందుబాటులోకి తెచ్చారు.

గతంలో జగనన్నకు చెబుదాం.. అంటూ వైసీపీ ప్రభుత్వం కూడా మొబైల్ నెంబర్ ఏర్పాటు చేసింది. నేరుగా జగనన్నే తమ మాట వింటారేమోనని జనం ఆతృతగా ఫోన్ చేశారు. చివరకు కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్ ద్వారా వినతులు స్వీకరించారు. ఇప్పుడు నేరుగా చంద్రబాబే వారి సమస్యలు పరిష్కరిస్తారని చెబుతూ కొత్త నెంబర్ విడుదల చేశారు. మరి దీనికి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. నిజంగా సమస్యల తీవ్రత, వాటి ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం ఇస్తే బాధితులు తమ బాధలు తీరిపోయినట్టు సంతోషపడతారు. త్వరితగతిన సమస్యలు పరిష్కారమైతే ఈ కొత్త ప్రయత్నం సఫలమైనట్టే. 

Tags:    
Advertisement

Similar News