వయో పరిమితి పెంపు.. ఏపీలో కూడా గ్రూప్స్ వాయిదా పడినట్టేనా..?

వయోపరిమితి పెంపుని కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నోటిఫికేషన్ల విడుదల ఆలస్యమవుతుందేమోననే అనుమానాలు నిరుద్యోగుల్లో మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఏపీలో కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Advertisement
Update:2023-10-11 11:25 IST

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ, ఇతర రిక్రూట్ మెంట్ ఏజెన్సీలు భర్తీ చేసే ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నాన్ యూనిఫామ్ పోస్ట్ లకు ఏకంగా 8ఏళ్లు, యూనిఫామ్ పోస్ట్ లకు రెండేళ్లపాటు గరిష్ట వయోపరిమితి పెంచింది. దీంతో నోటిఫికేషన్లు లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులకు కాస్త ఊరట లభించినట్టయింది. తాజా పెంపుతో నాన్ యూనిఫామ్ పోస్ట్ లకు 42 ఏళ్ల వయసున్నవారు కూడా పోటీ పడొచ్చన్నమాట. అయితే ఈ పెంపు 2024 సెప్టెంబర్‌ 30వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓసారి ఇలాగే వయోపరిమితి పెంచారు, మరోసారి దాన్ని పొడిగించారు.

నోటిఫికేషన్లు వాయిదా పడినట్టేనా..?

ఉద్యోగాలకు అప్లై చేసుకునే వయసు పరిమితిని పెంచారంటే దానర్థం నోటిఫికేషన్లు ఆలస్యం అవుతాయనే. నోటిఫికేషన్లు ఆలస్యం అవుతుంటే.. వయసు మీరిపోతుందని నిరుద్యోగులు ఆందోళనకు గురవుతుంటారు. వారిని ఊరడించేందుకే ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ పోస్ట్ లు, వాలంటీర్ పోస్ట్ లను మాత్రమే భర్తీ చేశారు. మెగా డీఎస్సీ ఊసు లేదు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్ట్ ల సంఖ్య కూడా నామమాత్రమే. ప్రస్తుతం వయోపరిమితి పెంపుని పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదలవడంతో ఎన్నికలలోపు కొత్త నోటిఫికేషన్లు ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడినట్టే అనుకోవాలి.

ఇటీవలే ఏపీలో గ్రూప్1, 2 పోస్ట్ ల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. రేపో మాపో నోటిఫికేషన్లు విడుదలవుతాయనుకుంటున్న టైమ్ లో జమిలి ఎన్నికల హడావిడి మొదలైంది. ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలుంటే నోటిఫికేషన్లు విడుదల చేయడం కష్టం. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జమిలి భయం తొలగిపోయింది. అయినా కూడా ఏపీపీఎస్సీనుంచి ఇంకా తన సన్నద్ధత తెలియజేయలేదు. ఇప్పుడిలా వయోపరిమితి పెంపుని కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నోటిఫికేషన్ల విడుదల ఆలస్యమవుతుందేమోననే అనుమానాలు నిరుద్యోగుల్లో మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఏపీలో కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News