విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

పీఆర్సీ ప్రతిపాదనలు ఆమోదిస్తూ శుక్రవారం ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. ఇతర డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు శాంతించారు.

Advertisement
Update:2023-08-10 07:12 IST

విద్యుత్ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 8 శాతం ఫిట్ మెంట్ కి ప్రభుత్వం అంగీకరించింది. వైద్య పరిమితి రూ.5లక్షలనుంచి రూ.10లక్షలకు పెంచేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. సింగిల్‌ మాస్టర్‌ స్కేల్‌ పీపీతో కలిపి రూ.2.60 లక్షలు, మాస్టర్ స్కేల్ దాటిన వారికి పర్సనల్ పే చేయబోతున్నారు. ఒక డీఏ విడుదల, 12 వాయిదాల్లో బకాయిలు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి 2018 స్కేల్‌ ప్రకారం జీతాలు అందించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించడంతో ఏపీ విద్యుత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

సమ్మె విరమణ..

తమ డిమాండ్ల సాధన కోసం ఏపీలో విద్యుత్ ఉద్యోగులు ఈరోజు(గురువారం)నుంచి సమ్మెకు సిద్ధమని గతంలో ప్రకటించారు. బుధవారం రాత్రి వరకు ఈ సమ్మెపై ఉత్కంఠ కొనసాగింది. ఉద్యోగులంతా ఆఫీస్ సిమ్ కార్డులు కూడా తిరిగిచ్చేసి సమ్మెకు సై అన్నారు. రాష్ట్రంలో అంధకారం నెలకొనే అవకాశముందని తేలడంతో ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. దీంతో ప్రభుత్వం వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో చర్చలు మొదలుపెట్టింది.

విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఇతర అధికారులు జరిపిన చర్చలు ఫలించాయి. విద్యుత్‌ సంస్థలను కాపాడుకునేందుకు యాజమాన్యం, ఉద్యోగులు ఎంతో కొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని మంత్రులు, అధికారులు సూచించారు. పీఆర్సీ ప్రతిపాదనలు ఆమోదిస్తూ శుక్రవారం ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. ఇతర డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు శాంతించారు. సమ్మె విరమించారు. 

Tags:    
Advertisement

Similar News