పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ
మధ్యాహ్నం 3 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఆయన సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా, ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పదవితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పొందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి వెలగపూడిలోని సచివాలయానికి వస్తుండడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఆయన సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బుధవారం తన ఛాంబర్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆయనకు సచివాలయం రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ ను కేటాయించింది. అదే అంతస్తులో జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రులకు కూడా ఛాంబర్లు కేటాయించింది.