ప్రతిపక్షాలకు జగన్ షాకిచ్చారా..?
ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రభావం చంద్రబాబు పర్యటనలపై తీవ్రంగా పడే అవకాశముంది. ఎందుకంటే ఇరుకురోడ్లలో, చిన్నస్థలాల్లో సభలు పెట్టుకుని తనసభల్లో పాల్గొనేందుకు జనాలు విరగబడుతున్నారంటూ చంద్రబాబు ఊదరగొడుతున్నారు.
ప్రతిపక్షాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. రోడ్లపై ర్యాలీలు, రోడ్డుషోలు, సమావేశాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ సభలు మాత్రం నిర్వహించుకోవచ్చు. అదికూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే సభలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. సభలకు అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి వరుసగా జరిగిన రెండు ఘటనలే కారణం. రెండు ఘటనలు కూడా చంద్రబాబునాయుడు పాల్గొన్న కార్యక్రమాలే కావటం గమనార్హం. నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు రోడ్డుషోలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు. ఆ ఘటనను మరచిపోకముందే గుంటూరు బహిరంగసభ తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు. రెండు వేర్వేరు కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవటం చిన్నవిషయం కాదు. పైగా రెండు చోట్లా టీడీపీ నిర్వహణ లోపం స్పష్టంగా బయటపడింది.
విచిత్రం ఏమిటంటే.. కందుకూరు తొక్కిసలాటకు పోలీసుల వైఫల్యమే కారణమని చంద్రబాబు అండ్ కో ఎదురుదాడి చేసింది. అలాగే గుంటూరు బహిరంగసభలో తొక్కిసలాటకు టీడీపీకి సంబంధమే లేదని బుకాయిస్తోంది. బహిరంగసభకు అనుమతి కావాలని టీడీపీ నేత తెనాలి శ్రవణ్ కుమార్ డీఎస్పీకి రాసిన లేఖ బయటపడినా టీడీపీ తగ్గటంలేదు. దాంతో ప్రభుత్వం రోడ్డుషోలు, ర్యాలీలు, రోడ్డు సైడ్ సమావేశాలను నిషేధించింది.
ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రభావం చంద్రబాబు పర్యటనలపై తీవ్రంగా పడే అవకాశముంది. ఎందుకంటే ఇరుకురోడ్లలో, చిన్నస్థలాల్లో సభలు పెట్టుకుని తనసభల్లో పాల్గొనేందుకు జనాలు విరగబడుతున్నారంటూ చంద్రబాబు ఊదరగొడుతున్నారు. ఇరుకురోడ్లలో హాజరైన కొద్దిపాటి జనాలను కూడా డ్రోన్లతో చిత్రీకరిస్తూ చాలా ఎక్కువమంది వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి కలరింగులు సాధ్యంకాదు. పెట్టుకుంటే చంద్రబాబు బహిరంగసభలు పెట్టుకోవాల్సిందే. అలాగే ఈనెల 27వ తేదీనుండి మొదలవ్వబోయే లోకేష్ పాదయాత్రకు కూడా ఉత్తర్వులు వర్తిస్తాయి. లోకేష్ పాదయాత్ర చేసుకోవచ్చు, జనాలను కలవచ్చు కానీ ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహించే అవకాశాలు లేవు. మరి దీనిపై చంద్రబాబు అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.