సీపీఎస్ రద్దు చేయండి మహాప్రభో.. విద్యుత్ బైక్ లు ఇస్తాం సరిపెట్టుకోండి

సీపీఎస్ రద్దు డిమాండ్ గట్టిగా వినిపించినప్పుడల్లా ప్రభుత్వం ఏదో ఒక ప్రత్యామ్నాయ సూచనతో సరిపెడుతోంది. తాజాగా మరోసారి విద్యుత్ వాహనాలు వచ్చేస్తున్నాయంటూ ప్రకటనలు విడుదల చేశారు అధికారులు.

Advertisement
Update:2022-11-19 08:55 IST

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి విచిత్రంగా ఉంది. సీపీఎస్ రద్దుకోసం వారు పోరాటాలు చేస్తున్నారు. హిమాచల్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల హామీలను చూపించి మరీ డిమాండ్లు వినిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అదిగో సబ్ కమిటీ, ఇదిగో తుది గడువు అంటూ కాలం సరిపుచ్చుతోంది. ఇటీవల జరిగిన చర్చల్లో కూడా ఆశలు అపరిమితంగా ఉండకూడదంటూ మంత్రి బొత్స వేదాంతం మాట్లాడారు. కట్ చేస్తే ఇప్పుడు ఉద్యోగులకు విద్యుత్ వాహనాలంటూ మరో లీకు ఇచ్చారు. గతంలోనే ఈ ప్రకటన వెలువడినా.. ఇప్పుడు వాహనాలను ఇచ్చే ప్రక్రియ వేగవంతం అయిందని, ఫలానా కంపెనీలతో ఒప్పందం కుదిరిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్‌ బైక్ లు, స్కూటీలు అందించే పథకాన్ని పునరుత్పాదక ఇంధన వనరులశాఖ (నెడ్‌ క్యాప్‌) ప్రారంభించింది. దీని కోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓలా, ఏథర్‌, బిగాస్‌, కైనెటిక్‌, టీవీఎస్‌, హీరో వంటి కంపెనీలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆప్కాబ్‌, ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ మెంట్‌ ఫైనాన్స్‌ కంపెనీలనుంచి వీటి కొనుగోలు కోసం ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందిస్తారు.

ఏడాదిలో లక్ష వాహనాలు..

ఏడాదిలో కనీసం లక్ష వాహనాలు ఉద్యోగులకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులంటున్నారు. విద్యుత్‌ వాహనాల కోసం 26 జిల్లాల్లో పని చేసే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా యాప్‌ కూడా అందుబాటులోకి తెచ్చారు. వాహనాలకు రుణాలను అందించడం కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రత్యేకంగా ఓ బ్రాంచ్ ని విజయవాడలో ఏర్పాటు చేయడం విశేషం.

తాయిలాలెందుకు..

గతంలో వలంటీర్లు జీతాలు పెంచండి అని డిమాండ్ చేస్తే.. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర.. అనే అవార్డులిస్తాం సరిపెట్టుకోండి అంటూ వారిని సముదాయించారు. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగుల గొడవ పెరిగే సరికి వారికి పరీక్షలు పెట్టి కొంత భారం తగ్గించుకుని ప్రొబేషన్ ఇచ్చారు. ఇక ప్రధాన ఉద్యోగుల చిరకాల డిమాండ్ సీపీఎస్ రద్దు మాత్రం ప్రభుత్వ ఖజానాకు పెను భారంగా మారింది. ఈ డిమాండ్ గట్టిగా వినిపించినప్పుడల్లా ప్రభుత్వం ఏదో ఒక ప్రత్యామ్నాయ సూచనతో సరిపెడుతోంది. తాజాగా మరోసారి విద్యుత్ వాహనాలు వచ్చేస్తున్నాయంటూ ప్రకటనలు విడుదల చేశారు. అయితే ఉద్యోగులు మాత్రం మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి చాలు, రాయితీలపై స్కూటీలు, ఇతర తాయిలాలు అవసరం లేదని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News