మార్కెట్‌ కోసమే చంద్రబాబు ఆరాటం.. డీఎల్‌ మా పార్టీలో లేరు..

తెలంగాణ వెళ్లి ఇది వరకు టీడీపీని వీడి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని పిలుపునిస్తున్న చంద్రబాబు.. మరి అదే పిలుపు ఏపీలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Advertisement
Update:2022-12-22 14:40 IST

చంద్రబాబుకు ఓటు కూడా తెలంగాణలోనే ఉండేదని.. కాబట్టి ఆయన తెలంగాణకు వెళ్లి అక్కడి ప్రజలకు సేవ చేయాలనుకుంటే తాము స్వాగతిస్తామన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ తెలంగాణలో ఎన్నికలు సమీపించిన సమయంలో అక్కడి వెళ్లి తమ బ్రాండ్‌ను మార్కెట్‌ పరంగా ప్రమోట్ చేసుకుని, డిమాండ్ పెంచుకుని, వస్తువును అమ్ముకోవాలి అన్నట్టుగా చంద్రబాబు రాజకీయం ఉంటోందన్నారు.

2018 ఎన్నికల సమయంలోనూ ఇలాగే రాహుల్‌ను ప్రధానిని చేస్తా అంటూ తెలంగాణలో చంద్రబాబు హడావుడి చేశారని సజ్జల గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్‌ ద్వారా ప్రయోగం చేశారని.. ఇప్పుడు బీజేపీ మీద ప్రయోగం చేయడానికే ఖమ్మంలో చంద్రబాబు మీటింగ్ పెట్టినట్టుగా ఉందన్నారు. తన పాత రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి తన మాటల ద్వారా ఖమ్మంలో చంద్రబాబు ప్రదర్శించారన్నారు.

తెలంగాణ వెళ్లి ఇది వరకు టీడీపీని వీడి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని పిలుపునిస్తున్న చంద్రబాబు.. మరి అదే పిలుపు ఏపీలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు సన్నిహితులైన ఏపీ టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరారని.. మరి వారిని వెనక్కు రావాల్సిందిగా ఎందుకు ఆహ్వానించడం లేదని సజ్జల ప్రశ్నించారు.

డీఎల్‌కి `కీ` ఇస్తున్నది ఎవరో తెలుసు!

వైసీపీలో ఉన్నానన్న విషయం డీఎల్ రవీంద్రారెడ్డి ఇప్పుడే ఎందుకు గుర్తించిందో మరి అని సజ్జల ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చి లోకల్‌లో డీఎల్‌ ఏం చేశాడు అన్నది స్థానిక నాయకులే వివరిస్తారన్నారు. తాను ఇంకా వైసీపీలోనే ఉన్నానని చెప్పుకుంటే తమ మాటలకు విలువ వస్తుందన్న ఉద్దేశంతోనే డీఎల్ వైసీపీలో ఉన్నట్టు చెప్పుకుంటుండవచ్చన్నారు. అసలు ఆయన వైసీపీలో ఉన్నట్టుగా ఎక్కడా ఆధారం లేదని.. కాబట్టి ఆయనపై తాము చర్యలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నం కాబోదన్నారు. డీఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబును ప్రశంసిస్తున్నారని.. దాన్ని బట్టే ఆయన వెనుక ఎవరున్నారో అర్థమైపోతోందన్నారు. జగన్‌ పుట్టిన రోజు ఘనంగా జరుగుతున్న సమయంలోనే దాన్ని చెడగొట్టడానికి చంద్రబాబే కరెక్టుగా నిన్ననే డీఎల్‌తో మాట్లాడించినట్టుగా ఉందన్నారు.

Tags:    
Advertisement

Similar News