కొడాలి నాని, పేర్ని నాని, అనిల్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..
ప్రతిపక్షాలపై మంత్రుల విమర్శల డోసు సరిపోవడంలేదని సీఎం జగన్ మందలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మంత్రి వర్గంలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ పేర్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి.
మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలకు అత్యథిక ప్రాధాన్యమిచ్చిన సీఎం జగన్, సెకండ్ బ్యాచ్ లో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ని పక్కన పెట్టారు. మంత్రులుగా ఎవరి పనితనం ఏంటి అనే విషయం పక్కనపెడితే.. వీరంతా సీఎం జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ని చెడామడా తిట్టేవారు. జగన్ చుట్టూ ఓ రక్షణ కవచంలా ఉండేవారు. వీరితోపాటు మరికొంతమంది నేతలు కూడా జగన్ తరపున గట్టిగా మాట్లాడినా.. ఈ ముగ్గురు మాత్రం సంథింగ్ స్పెషల్. ప్రతిపక్షాలు కూడా వీరికి ఎదురొచ్చేవి కావు. అలాంటి ముగ్గురు నేతల్ని జగన్ మంత్రి వర్గం నుంచి ఎందుకు తప్పించారా అనే ప్రశ్నలు అప్పట్లో బాగానే వినిపించాయి.
అక్కడ సీన్ కట్ చేస్తే, మళ్లీ ఇప్పుడు ఆ మూడు పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి. ప్రతిపక్షాలపై మంత్రుల విమర్శల డోసు సరిపోవడంలేదని సీఎం జగన్, కేబినెట్ భేటీలో మందలించిన సంగతి తెలిసిందే. అవసరమైతే మరోసారి మంత్రి వర్గాన్ని మార్చేందుకు సైతం తాను వెనకాడనని జగన్ హెచ్చరించినట్టు చెబుతున్నారు. ప్రభుత్వంపై నిందలు వేస్తే ప్రతి ఒక్కరూ స్పందించాలని, ఆ బాధ్యత మంత్రులకు ఎక్కువ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు జగన్. ఈ నేపథ్యంలో గత మంత్రి వర్గంలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ పేర్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఆ ముగ్గరు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు నెటిజన్లు.
మంత్రులకు జగన్ క్లాస్ తీసుకున్నారనే సమాచారం వైసీపీ సోషల్ మీడియా విభాగాల్లో కూడా బాగా హైలెట్ అయింది. వైసీపీకి అనుకూలంగా ట్వీట్లు పెట్టే వారు కూడా.. కొడాలి, పేర్ని, అనిల్ పేర్లు హైలెట్ చేస్తూ.. ఇప్పుడున్న మంత్రులు ఆ స్థాయిలో రియాక్ట్ కావడంలేదని అంటున్నారు. అంటే జగన్ కే కాదు, సామాన్య వైసీపీ కార్యకర్తలు, కింది స్థాయి నేతలకు కూడా మంత్రుల రియాక్షన్లు సరిపోవడంలేదనమాట. ఇప్పుడు కేబినెట్ లో ఉన్నవారెవరూ విమర్శల దాడిలో ఆ ముగ్గురినీ రీచ్ కాలేకపోతున్నారనమాట. అంబటి, రోజా, అమర్నాథ్.. అడపాదడపా ఘాటుగా మాట్లాడుతున్నా.. ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే వీరి ప్రభావం మరింత ఎక్కువగా ఉందని, మంత్రులయ్యాక స్పీడ్ కాస్త తగ్గిందనే వాదన కూడా ఉంది. మొత్తమ్మీద సీఎం జగన్ ఏ కారణంతో ఆ ముగ్గుర్ని పక్కనపెట్టినా, మరో కారణంతో ఆ ముగ్గురు ఇప్పుడు హైలెట్ అవుతున్నారు.