నీ పాదంమీద పుట్టుమచ్చనై..
చెల్లెలు పాదంపై పుట్టుమచ్చగానో, అక్క నుదుటన తిలకంగానో అలంకరణ అయినప్పుడే వారి రుణం తీర్చుకున్నట్టవుతుందని చెప్పారు పవన్ కల్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కవితాత్మకంగా రాష్ట్ర ప్రజలకు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అన్న, చెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ అనుభవంతోనే అర్థమవుతుందన్నారు పవన్. అక్క చెల్లెళ్ల అనురాగం అనే రుణాన్ని ఏమిచ్చినా తీర్చుకోలేమన్నారు. ఈ సందర్భంగా గద్దర్ పాటను గుర్తు చేశారు డిప్యూటీ సీఎం. చెల్లెలు పాదంపై పుట్టుమచ్చగానో, అక్క నుదుటన తిలకంగానో అలంకరణ అయినప్పుడే వారి రుణం తీర్చుకున్నట్టవుతుందని చెప్పారు.
అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరూ వెలకట్టలేరని, వారికి జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజిస్తేనే ఆ రుణం తీరుతుందన్నారు. అనురాగానికి ప్రతీకైన రక్షా బంధన్ పండగ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ వేశారు పవన్.
రాఖీ పండగ రోజు కూడా వరుస సమీక్షలతో బిజీగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభల నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ పథకానికి వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని, ప్రతి రూపాయినీ బాధ్యతతో వ్యయం చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలన్నారు. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు పవన్ కల్యాణ్.