పేదల ఇళ్లను చూసి ఓర్వలేక.. పవన్ ఆరోపణలు
పవన్ కల్యాణ్ రాసిన లేఖపై రూ.35 వేల కోట్లు కుంభకోణం ఎలా జరిగిందని ప్రధాని మోదీ తిరిగి ప్రశ్నిస్తే పవన్ తెల్లమొహం వేయడం ఖాయమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తూ విప్లవాత్మక చర్యలతో ముందుకెళుతున్న జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బురదచల్లే ప్రయత్నం చేయడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటుగా రియాక్టయ్యారు. జగనన్న ఇళ్ల స్థలాలు, ఇళ్లకు సంబంధించి రూ.35 వేల కోట్ల అవినీతి జరిగిందంటూ పవన్ ప్రధానికి లేఖ రాయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పవన్‌కు తిరం తప్పిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిగూడెంలో శనివారం మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఊడిగం చేయడానికి పవన్ కల్యాణ్ సిద్దమయ్యాడని, దానిని ఎవరైనా వ్యతిరేకిస్తే జనసేన నుంచి బయటికి పంపించేస్తున్నాడని విమర్శించారు. అసలు రూ.35 వేల కోట్ల కుంభకోణం జరిగిందని పవన్ ఏ రకంగా చెప్పగలడని ఆయన ప్రశ్నించారు. ఇళ్లు లేని పేదలకు సొంతిళ్లు కల్పించే బృహత్తర పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టి.. వాటిని సాక్షాత్కారం చేస్తుంటే.. చూసి ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి సొంత ఇల్లు నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. అంతేకాకుండా రూ.2 లక్షల 45 వేల కోట్ల మొత్తాన్ని సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు నేరుగా అందించారన్నారు.
ఇదేమైనా రూ.35 వేల కోట్లకు చెక్కు రాసి ఒకరికి ఇచ్చేస్తే వారు జేబులో వేసేసుకునే వ్యవహారమా అని మంత్రి కొట్టు సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ రాసిన లేఖపై రూ.35 వేల కోట్లు కుంభకోణం ఎలా జరిగిందని ప్రధాని మోదీ తిరిగి ప్రశ్నిస్తే పవన్ తెల్లమొహం వేయడం ఖాయమన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి కుంభకోణంలో ఇరుక్కుని విదేశాలకు పారిపోయిన వారిని వెతికి పట్టుకునేందుకు అవసరమైతే ఇంటర్ పోల్ ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. తమ జీవితంలో సొంత ఇల్లు కట్టుకోలేమని అది కలగానే మిగిలిపోతుందని అనుకున్న 31 లక్షల మంది పేద కుటుంబాలు సొంత ఇంటి కల నెరవేరుతోందనే సంతోషంలో ఉంటే.. పవన్‌కు మాత్రం మతిభ్రమించి తిరం లేనట్టు వ్యవహరిస్తున్నాడని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.