ఓఎస్డీతో సీఎస్ కథనంపై జవహర్ రెడ్డి ఆగ్రహం

తప్పుడు కథనాలు రాసినందుకు గాను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు కథనాన్ని పత్రికల్లో ఏయే పేజీల్లో ప్రచురించారో, చానళ్లలో ఏయే సమయాల్లో ఎంత సేపు ప్రసారం చేశారో అంతే ప్రాధాన్యతతో తన ఖండ ప్రకటనను ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Update:2023-02-06 09:18 IST

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన సీఎం జగన్‌ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్‌ ఇంట్లో పనిచేసే నవీన్‌లను కడప సెంట్రల్ జైలు వద్ద నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తన కారులో స్వయంగా తీసుకెళ్లారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇతర మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలను ఏపీ సీఎస్ ఖండించారు. కడప జైలు దగ్గరి నుంచి ఒకే కారులో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి వీరు విమానంలో విజయవాడకు వెళ్లినట్టు కథనాలు వచ్చాయి.

వీటిపై సీఎస్ జవహర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దారుణమైన అబద్దాలతో కథనాలు రాశారని ఒక ప్రకటనలో ఆక్షేపించారు. సీఎస్‌గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అధినేతనైన తనను చులకన చేసేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ మీడియా సంస్థలు కట్టుకథలు అల్లాయని విమర్శించారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలపురంలో 5 కోట్లతో పునర్‌ నిర్మించిన సోమేశ్వరాలయం మహా కుంభాభిషేకం కార్యక్రమంలో తాను పాల్గొన్న మాట వాస్తవమేనన్నారు. ఆ కార్యక్రమ షెడ్యూలు నాలుగు నెలల క్రితమే సిద్ధమైందని వివరించారు.

కడపలో జరిగిన మిగిలిన కార్యక్రమాలు కూడా ముగించుకుని సాయంత్రం 4.40 నిమిషాలకు బయలుదేరి, రాత్రి 8.15 నిమిషాలకు రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లినట్టు వివరించారు. కానీ తాను ఓఎస్‌డీ కృష్ణమోహన్‌తో కలిసి విజయవాడ వెళ్లినట్టు తప్పుడు కథనాలు రాశారని అభ్యంతరం తెలిపారు. తాను కృష్ణమోహన్ రెడ్డి కలిసి ప్రయాణం చేసినట్టు రాసిన కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

తప్పుడు కథనాలు రాసినందుకు గాను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు కథనాన్ని పత్రికల్లో ఏయే పేజీల్లో ప్రచురించారో, చానళ్లలో ఏయే సమయాల్లో ఎంత సేపు ప్రసారం చేశారో అంతే ప్రాధాన్యతతో తన ఖండ ప్రకటనను ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News