పెద్ద మనసుతో ఆదుకోండి.. కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెలలో రెండు సార్లు ఢిల్లీ పర్యటించి కేంద్రమంత్రులను ప్రసన్నం చేసుకున్నారు.

Advertisement
Update:2023-03-30 17:33 IST

సీఎం జగన్ ఢిల్లీ టూర్ ముగిసింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, విభజన చట్టంలోని హామీల అమలు, ఇతర అంశాలపై జగన్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. జగన్ షెడ్యూల్‌ ప్రకారం గురువారం ఉదయం 9:30 గంటలకు విజయవాడకు బయలుదేరాల్సి ఉంది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌‌ అపాయింట్మెంట్ చివరి నిమిషంలో ఖరారు కావడంతో పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

తొలుత నిర్మలా సీతారామన్ అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. దీంతో ఉదయం ఏపీకి వెళ్లిపోవాలని నిర్ణయించారు. చివరి నిమిషంలో నిర్మలా సీతారామన్‌ నుంచి ఆహ్వానం లభించడంతో ఆమె వద్దకు వెళ్లారు. మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పెండింగ్‌ నిధులతోపాటు గ్రాంట్లు విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను సీఎం జగన్ కోరారు.

ఇకపోతే బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో సుమారు 40 నిమిషాల పాటు రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు.

అలాగే పోలవరం ప్రాజెక్టుకు అడ్ హక్‌గా రూ. 10వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద పెండింగ్‌లో ఉన్న రూ.36,625కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.7,058కోట్లు, ప్రత్యేక హోదా, 14 మెడికల్ కళాశాలలకు ఆర్థిక సహకారం వంటి అంశాలపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెలలో రెండు సార్లు ఢిల్లీ పర్యటించి కేంద్రమంత్రులను ప్రసన్నం చేసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వరుసగా భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News